Debit Card: డెబిట్ కార్డుపై బీమా

by S Gopi |   (  Updated:2025-12-15 11:31:04  IST  )

డెబిట్ కార్డు ఇచ్చే అన్ని బ్యాంకులు ఖాతాదారుల కోసం కాంప్లిమెంటరీ బీమాతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.

Debit Card: డెబిట్ కార్డుపై బీమా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం దేశంలో చాలామందికి బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ ఖాతా ఉన్న వాళ్లందరికీ బ్యాంకులు తప్పనిసరిగా డెబిట్ కార్డులు ఇస్తాయి. దీని ద్వారా ఏటీంలలో నగదు విత్‌డ్రా చేయడం, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు. అయితే, దేశంలోని చాలా బ్యాంకులు తమ డెబిట్ కార్డ్ హోల్డర్లకు కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తున్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే, ఇది కొన్ని షరతులతో వర్తిస్తుంది. డెబిట్ కార్డ్ హోల్డర్ వాటిని నెరవేర్చకపోతే జీవిత బీమా కవర్ పనిచేయదు. ఇందులో డెబిట్ కార్డ్ హోల్డర్ నిర్దిష్ట కాలంలో కనీసం ఒక లావాదేవీనైనా చేసి ఉండాలి అనేది షరతులలో ఒకటి. అలాంటి ఈ బీమా కవర్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

డెబిట్ కార్డుపై వర్తించే బీమా పాలసీ సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా ఉంటాయి. ఇవి వ్యక్తిగత ప్రమాదంతో పాటు విమాన ప్రమాదం, కార్డు మోసం వంటి వాటిని కవర్ చేస్తుంది. గ్రూప్ పాలసీ కావడం మూలంగా ప్రతి డెబిట్ కార్డుదారుడికి వేర్వేరు పాలసీ నంబర్లు ఉండవు. అయినప్పటికీ డెబిట్ కార్డు ఇచ్చే అన్ని బ్యాంకులు ఖాతాదారుల కోసం కాంప్లిమెంటరీ బీమాతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) ఇండియా వంటి అనేక ప్రముఖ బ్యాంకులు డెబిట్ కార్డులపై ఉచిత బీమా పాలసీని అందిస్తున్నాయి.

యాక్సిడెంట్ కవర్

చాలా డెబిట్ కార్డులు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందిస్తున్నాయి. అవి, ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం సంభవిస్తే బీమా కవర్‌ వర్తిస్తుంది. ఇది బ్యాంకు, డెబిట్‌ కార్డు రకాన్ని బట్టి కవరేజ్‌ మొత్తం, క్లెయిమ్ ప్రక్రియ, సమయంలో మార్పులు ఉంటాయి. ఖాతాదారులు, నామినీలు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌లో రూ.50 వేల నుంచి రూ.1 కోటి వరకు కూడా బీమా పొందవచ్చు. రోడ్డు, రైలు ప్రమాదం మాత్రమే కాకుండా, విమాన ప్రయాణీకులకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ, విమానం ప్రమాదానికి సంబంధించి ఫ్లైట్ టికెట్‌ను డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేయడం లాంటి షరతులకు లోబడే బీమా కవరేజ్‌ ఉంటుంది.

క్లెయిమ్ కోసం క్లిష్టమైన షరతులు

డెబిట్‌ కార్డుపై బీమాకు అర్హతకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇందులో ఒక నిర్దిష్ట రకమైన లావాదేవీ సంఘటన జరిగిన కొన్ని రోజులలోపు పూర్తి చేయడం క్లిష్టమైన షరతులలో ఒకటి. ఉదాహరణకు కోటక్ మహీంద్రా గోల్డ్, ప్లాటినం డెబిట్ కార్డ్ హోల్డర్లు గడిచిన 60 రోజుల్లో కనీసం 6 పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) లేదా ఒక్కొక్కటి రూ. 500 విలువైన ఈ-కామర్స్ లావాదేవీలు చేసి ఉండాలి. డీబీఎస్ బ్యాంక్ ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్ ఉన్నవారైతే గడిచిన 90 రోజుల్లో కనీసం ఒక పీఓఎస్ లేదా ఈ-కామర్స్ లావాదేవీని నిర్వహించడం అవసరం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ కస్టమర్ల కోసం గడిచిన 30 రోజుల్లో కనీసం ఒక పీఓఎస్ లేదా చెల్లింపుల గేట్‌వే లావాదేవీ ముఖ్యం. ఇతర బ్యాంకుల్లో ఈ షరతులు వేర్వేరుగా ఉంటాయి.

డెబిట్ కార్డ్ ఉన్నవారు, ముందుగా సదరు కార్డు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉందో లేదో తనిఖీ చేయాలి. లావాదేవీకి సంబంధించి కాలవ్యవధి, మొత్తం వంటి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఈ షరతుల ద్వారా ఉచిత జీవిత బీమా కవర్‌ను సజీవంగా ఉంచుకునేలా చూసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, మీ డెబిట్ కార్డును ఉపయోగించి ప్రతి నెలా ఏదైనా నెలవారీ యుటిలిటీ బిల్లును చెల్లించాలని లేదా కారుకు ఫ్యూయెల్ చెల్లించి కార్డును సజీవంగా ఉంచుకోవచ్చు.

డెబిట్ కార్డుపై బీమా క్లెయిమ్ ఎలా చేయాలి

బ్యాంక్ నిబంధనలు, షరతులను బట్టి, నామినీ లేదా పాలసీదారుడి క్లెయిమ్ పత్రాలతో నిర్దిష్ట వ్యవధిలోపు బ్యాంకును సంప్రదించాలి. సంఘటన జరిగిన 60 రోజులలోపు క్లెయిమ్ దాఖలు చేయాలి. అయితే వివిధ బ్యాంకులు వేర్వేరు నిబంధనలను కలిగి ఉంటాయనే విషయం మరవొద్దు. కొన్ని బ్యాంకు ఆన్‌లైన్ ద్వారా కూడా కీలక డాక్యుమెంట్లను అందించే సదుపాయం అందిస్తున్నాయి. డెబిట్ కార్డుదారు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా క్లెయిమ్ కోసం నామినీ క్లెయిమ్ ఫామ్, , ప్రమాదం జరిగినట్టు నిర్ధారించే డాక్యుమెంట్లు, నామినీ కేవైసీ వివారాలు ఇవ్వాల్సి ఉంటుంది.

క్లెయిమ్ చేసేందుకు అవసరమైన పత్రాలు

* నామినీ చిరునామాతో సహా సంప్రదించాల్సిన వివరాలు

* బీమా క్లెయిమ్ ఫారం,

* ఖాతాదారు డెత్ సర్టిఫికేట్

* పూర్తి పోస్ట్‌మార్టం రిపోర్ట్

* ఎఫ్ఐఆర్ లేదా పంచనామా లేదా విచారణ పంచనామా (ప్రమాదం జరిగితే మాత్రమే). ఇంకా యాక్సిడెంట్ జరిగిన సందర్భాలలో, స్పాట్ పంచనామాతో పాటు ప్రమాదం జరిగిన ప్రదేశం, అందులో పాల్గొన్న వాహనం ఫోటో కూడా అవసరం.

* సంఘటన తర్వాత చికిత్స పొందుతున్నప్పుడు కార్డుదారు మరణిస్తే, ఆసుపత్రిలో చేరిన పత్రాలు, అడ్మిట్ అయిన వివరాలు ఇవ్వాలి.

* శాలరీ స్లిప్పులు లేదా వ్యాపారం చేస్తుంటే దాని వివరాలి.

ఒకవేళ కార్డుదారు బీమా కోసం నామినీ పేరును ఇవ్వని పక్షంలో, బ్యాంకుకు వారసుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వాటిని బ్యాంకులో ఇవ్వొచ్చు లేదా కాల్‌ సెంటర్‌ ద్వారా సమాచారం అందించి, సదరు డాక్యుమెంట్లను ఈ-మెయిల్‌ ద్వారా కూడా పంపొచ్చు. క్లెయిమ్ ప్రాసెస్‌ చేయడానికి, ఆమోదం కోసం పట్టే సమయం డెబిట్‌ కార్డుకు ఇచ్చిన బీమా సంస్థను బట్టి మారుతుంది. క్లెయిమ్ ఆమోదం తర్వాత కవరేజ్‌కు సంబంధించి నిబంధనలు, షరతుల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.

శాలరీ అకౌంట్ ఉన్నవారికీ బీమా

చాలా బ్యాంకులు డెబిట్ కార్డ్ ద్వారా లేదా కార్పొరేట్ గ్రూప్ పాలసీ ద్వారా శాలరీ అకౌంట్ ఉన్నవారికీ ఉచిత ప్రమాద బీమాను అందిస్తాయి.

* ఉదాహరణకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సిల్వర్, గోల్డ్, ప్లాటినం వంటి డెబిట్ కార్డును బట్టి రూ. 2-20 లక్షల వరకు డెత్ కవర్ అందిస్తోంది.

* ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు రకం బట్టి రూ. 2-10 లక్షల మధ్య, పూర్తి వైకల్యానికి 100 శాతం, పాక్షికంగా వైకల్యం ఏర్పడితే 50 శాతం కవరేజీ అందిస్తుంది.

* ఐసీఐసీఐ బ్యాంక్ శాలరీ అకౌంట్ కార్డు రకం బట్టి రూ. 2-10 లక్షల కవర్ అందిస్తోంది.

* యాక్సిస్ బ్యాంక్ కూడా శాలరీ అకౌంట్ కార్డు ఆధారంగా రూ. 2-25 లక్షలు ఇస్తుంది.

* కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డు రకం బట్టి రూ. 2-10 లక్షల పాలసీ ఆఫర్ చేస్తోంది.

గమనిక: కవరేజీ అనేది బ్యాంకు కార్డ్ రకం, బ్యాంక్ పాలసీని బట్టి మారుతుంది. సాధారంగా శాలరీ అకౌంట్లు తరచుగా మెరుగైన బీమాను కలిగి ఉంటాయి. జీతం స్థాయిలను బట్టి కవరీజీ వర్తిస్తుందనే విషయం మరవకూడదు. వ్యాపారులకూ భిన్నమైన పాలసీ వర్తిస్తుంది.

ఎంత కవరేజీ వస్తుందంటే..

* ప్రమాదంలో మరణిస్తే బ్యాంకు, కార్డు ఆధారంగా డెత్ కవర్ రూ. 2-25 లక్షలు

* శాశ్వత వైకల్యం ఏర్పడితే డెత్ కవర్‌కు నిర్ణయించిన మొత్తమే అందుతుంది.

* శాశ్వత పాక్షిక వైకల్యం కోసం బీమా కోసం 10-70 శాతం ఇస్తారు.

* ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.

* విమాన ప్రమాదంలో కవరేజ్ కొన్ని ప్రీమియం కార్డులకు రూ. 50 లక్షలు – రూ. కోటి వరకు ఇస్తాయి.

కార్లకు క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్

Next Story