బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి సమయమా? నిపుణులు ఏం చెప్తున్నారు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-11 09:07:11  IST  )

బడ్జెట్ వేళ బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ లోహాలను కొనేందుకు కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సమయంలో వీటిని కొనడం మంచిదేనా? మున్ముందు ఇంకా తగ్గే ఛాన్సుందా?

బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి సమయమా? నిపుణులు ఏం చెప్తున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తఏడాదిలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగి.. ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరాయి. కానీ.. జనవరి 30 నుంచి బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. బడ్జెట్ ఉండటంతోనే ఈ మార్పులొచ్చాయని కొందరు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతోనే తగ్గుతున్నాయని మరికొందరు, అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ గా ట్రంప్ కెవిన్ వార్ష్ ను నామినేట్ చేయాలనుకోవడంతోనే పతనం మొదలైందని ఇంకొందరు భావిస్తున్నారు. ఏదేమైనా బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేక్ పడి పతనం మొదలవ్వడంతో.. కొనుగోలుదారుల్లో.. ముఖ్యంగా మధ్యతరగతి వారిలో మళ్లీ వాటిని కొనాలన్న ఆశ చిగురించింది. అయితే.. బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గుతాయా? లేక కొనేందుకు ఇదే మంచి సమయమా? అని ఇన్వెస్టర్లు, కొనుగోలుదారుల్లో చర్చ మొదలైంది.

బడ్జెట్ తర్వాత భారీ ఊగిసలాట

యూనియన్ బడ్జెట్ 2026 తర్వాత మార్కెట్లలో తీవ్ర అస్తిరత నెలకొంది. గత వారం బంగారం, వెండి ధరలు 1980 తర్వాత తొలిసారి ఇంత భారీగా ఒక్కరోజులో పడిపోయాయి. భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.80 లక్షల స్థాయి నుంచి రూ.1,51,530 వరకు తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ.4.20 లక్షల నుంచి దాదాపు రూ.3,00,00కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు సుమారు 4,864 డాలర్లకు, వెండి 84.66 డాలర్లకు తగ్గింది. గత ఏడాది బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్లో ఊగిసలాట పెరిగింది. అయితే ప్రస్తుతం దిగుమతి సుంకం దాదాపు 6 శాతంగానే కొనసాగుతోంది.

ధరలు ఎందుకు పడిపోయాయి?

ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం ‘ప్రాఫిట్ బుకింగ్’. గత కొన్ని వారాలుగా భారీ లాభాలు రావడంతో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు లాభాలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు తగ్గాయి. ఈ ప్రభావం కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌కు 5,600 డాలర్ల పై స్థాయి నుంచి 5,160–5,320 డాలర్ల మధ్యకు తగ్గింది. వెండి కూడా 121 డాలర్ల నుంచి 108–111 డాలర్లకు దిగివచ్చింది. భారీ పతనం తర్వాత కూడా తక్కువ స్థాయిల్లో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దేశీయంగా బంగారం ధర రూ.1.57 లక్షల నుంచి రూ.1.59 లక్షల మధ్య బలమైన మద్దతు పొందుతోంది. వెండి కూడా కిలోకు రూ.3.55–3.60 లక్షల వద్ద నిలకడగా ఉంది.

ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదేనా?

ఇటీవల బంగారం, వెండి ధరల పతనాన్ని.. భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా నిపుణులు చెబుతున్నారు. ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్ల డిమాండ్ ఇంకా బలంగానే ఉందని, భారీగా ధరలు తగ్గిన ప్రతిసారీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీర్ఘకాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా, దశలవారీగా (సిప్ తరహాలో) కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగవచ్చని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం కావచ్చని చెబుతున్నారు.

Read More..

మహిళలకు భారీ గుడ్‌న్యూస్.. అమాంతం పడిపోయిన బంగారం, వెండి ధరలు

Next Story