Silver: కొత్త గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు

by S Gopi |   (  Updated:2026-01-13 09:23:52  IST  )

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, దాని ఛైర్మన్ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగారం, వెండి లాంటి సురక్షిత పెట్టుబడులకు మరోసారి గిరాకీ పెరుగుతోంది.

Silver: కొత్త గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, దాని ఛైర్మన్ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగారం, వెండి లాంటి సురక్షిత పెట్టుబడులకు మరోసారి గిరాకీ పెరుగుతోంది. ఫలితంగా పెట్టుబడిదారులు వీటిలో మదుపు చేసేందుకు మొగ్గు చూపడంతో సోమవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ట స్థాయిలకు దూసుకెళ్లాయి. మరోవైపు, ఇరాన్‌లో పెరుగుతున్న అశాంతి, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణతో భౌగోళిక రాజకీయ ఆందోళనలు కూడా మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధానిలో వెండి ధరలు కిలోకు రూ. 2,70,000 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లోనూ వెండి కిలో ఏకంగా రూ. 12,000 పెరిగి రూ. 2,87,000గా ఉంది. స్వచ్ఛమైన బంగారం కూడా 10 గ్రాములకు రూ. 1,42,250 వద్ద కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్లింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 1,550 పెరిగి రూ. 1,30,300కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, స్పాట్ బంగారం ధర మొదటిసారిగా ఔన్సుకు 4,600 డాలర్లను అధిగమించింది. వెండి ధరలు ఔన్సుకు 84 డాలర్ల స్థాయిని అధిగమించి కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్లు రూ. 2,431 లేదా 1.8 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,41,250 వద్ద రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వెండి ఫ్యూచర్లు కూడా మార్చి కాంట్రాక్ట్‌కు సంబంధించి రూ. 11,271 లేదా 4.46 శాతం పెరిగి, కిలో రూ. 2,63,996 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.

READ MORE .....

తారాజువ్వలా దూసుకెళ్తున్న వెండి.. పట్టీలు కొనాలన్నా భారమేనా?

Next Story