గోనె సంచిలో శవం.. కేసును ఛేదించిన పోలీసులు

by  |
Banswada police
X

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ వద్ద గోనె సంచిలో దొరికిన శవం కేసును బాన్సువాడ పోలీసులు ఛేదించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గతనెల నవంబర్ 24న నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం గోనెసంచిలో లభ్యమైనట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి ఎడమవైపు ఛాతిపై ‘‘R.A.L.A’’ అని ఇంగ్లీష్‌లో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన అరేటిక్యాల రాజు(34)గా గుర్తించారు. దీంతో వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబసభ్యులను విచారించగా మృతుడు రాజుకు పెద్ద శంకరంపేట్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు.

కొంతకాలం పాటు కొనసాగిన వీరి వివాహేతర సంబంధాన్ని, ఇటీవల సదరు వివాహిత కొనసాగించడానికి నిరాకరించింది. అయినా.. మృతుడు రాజు ఆమె కోసం కమలాపూర్ గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో సదరు మహిళ, ఆమె భర్త, మరో వ్యక్తితో కలిసి రాజును హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కట్టి శవాన్ని నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పడేసి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులైన మహిళ, ఆమె భర్త, మరో ఇద్దరిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. అంతేగాక.. ఈ కేసును ఛేదించిన బాన్సువాడ రురల్ సీఐ చంద్రశేఖర్, నిజాంసాగర్ ఎస్ఐ సయ్యద్ హైమాద్, ఏఎస్ఐ రాములు, పోలీసు సిబ్బంది వస్సీ, వీరభద్ర, సంగమేశ్వర్, రమేష్, రాజు, శ్రీశైలంలను బాన్సువాడ డీఎస్పీ అభినందించారు.

Next Story