హైదరాబాద్ ను యూటీగా మార్చే కుట్ర జరుగుతోంది:హరీశ్ రావు

by prasad |
హైదరాబాద్ ను యూటీగా మార్చే కుట్ర జరుగుతోంది:హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, అబద్ధాలు చెప్పి అబాసు పాలైందని, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలన్నీ తుస్సే అని, కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తే మాయమాటలతో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. హనుమకొండలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన ప్రశ్నించే గొంతుక అవుతానన్న తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసాలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే కుట్ర జరుగుతోందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ గురించి మనకు తెలియనిది కాదని, ఖమ్మం జిల్లాలో మన ఏడు మండలాలను ఏపీకి అప్పగిస్తూ బీజేపీ బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ మద్దతు తెలిపిందన్నారు.

తెలంగాణ మీద బీఆర్ఎస్ కు ఉన్న ప్రేమ ఏనాటికి ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఉండవన్నారు. వారివన్ని జాతీయ రాజకీయాలని దుయ్యబట్టారు. గోదావరి జలాలను తరలించుకుపోతామని కేంద్రం చెబుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మన నీళ్లు మనకు దక్కాలంటే ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలన్నారు. రాష్ట్ర చిహ్నంలో నుంచి కాకతీయ తోరణాన్ని కేసీఆర్ పెడితే దాన్ని రేవంత్ రెడ్డి తొలగించాలని చూస్తున్నారని, వరగంల్ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తున్న రేవంత్ సర్కార్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల నుంచి 14 గంటల విద్యుత్ సరఫరా వస్తోందని సర్కార్ దవాఖానాల్లో కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ పోయాయని, ఆసుపత్రుల్లో కరెంట్ కోతలతో మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ కు కనువిప్పు కలగాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ ఏనాడు ఓటడిపోలేదని మరోసారి మనమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed