బెదిరింపులు కాదు. అభివృద్ధిపై చర్చకు రండి: జగన్‌కు మంత్రి సవిత సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 13:33:27  IST  )

బెదిరింపులు కాదని, అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ సీఎం జగన్‌కు మంత్రి సవిత సవాల్ విసిరారు..

బెదిరింపులు కాదు. అభివృద్ధిపై చర్చకు రండి: జగన్‌కు మంత్రి సవిత సవాల్
X

దిశ, కడప ప్రతినిధి: రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి దిశగా పాలన సాగుతున్న తరుణలో వైసీపీ నాయకులు బెదిరింపులు కాదని, అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు చేయడం బదులుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు రావాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. కడప టీడీపీ కార్యాలయంలో శనివారం కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డితో పాటు 42 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన

మంత్రి సవిత మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం దక్కిందన్నారు. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నారన్నారు.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీలో కష్టపడ్డవారికి గుర్తింపు లభిస్తోందని, యువతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు.

సూపర్ సిక్స్ విజయవంతం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, “సూపర్ సిక్స్” పథకాలు విజయవంతమయ్యాయని తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉందన్నారు.

“కడపలో క్లీన్ స్వీప్ మా లక్ష్యం”

రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని కూడా కూటమి కైవసం చేసుకుంటుందని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో టీడీపీ బలంగా ఉందని, సుమారు నాలుగున్నర లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కూటమికి అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు హింసాత్మక వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో చర్చే మార్గమని అన్నారు.

టీటీడీ లడ్డూ అంశంపై వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి సవిత ప్రస్తావించారు. ఈ అంశంపై వైసీపీ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే, వైవీ సుబ్బారెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

చెన్నైలోనూ జగన్ క్రేజ్ తగ్గదేలే.. మాజీ సీఎం పర్యటనతో అభిమానుల కోలాహలం!

Next Story