చెన్నైలోనూ జగన్ క్రేజ్ తగ్గదేలే.. మాజీ సీఎం పర్యటనతో అభిమానుల కోలాహలం!

by Ramesh Naini |   (  Updated:2026-02-07 13:34:22  IST  )

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి క్రేజ్ పొరుగు రాష్ట్రంలోనూ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది.

చెన్నైలోనూ జగన్ క్రేజ్ తగ్గదేలే.. మాజీ సీఎం పర్యటనతో అభిమానుల కోలాహలం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి క్రేజ్ పొరుగు రాష్ట్రంలోనూ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తన సమీప బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న జగన్‌ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి నివాసంలో జరుగుతున్న వివాహ వేడుకలకు జగన్ హాజరయ్యారు. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్, వేదికల వివాహం రేపు (ఆదివారం) ఉదయం ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్ ఒక రోజు ముందుగానే చెన్నై చేరుకున్నారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు..

చెన్నైలోని ఇంజంబాక్కం విజీపీ (VGP) లేఅవుట్‌లో ఉన్న అనిల్ రెడ్డి నివాసం వద్ద సందడి నెలకొంది. వైఎస్ జగన్ అక్కడకు చేరుకున్నారన్న సమాచారంతో చెన్నైలో నివసిస్తున్న తెలుగు వారు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అభిమానుల తాకిడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ పలకరించారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

బెదిరింపులు కాదు. అభివృద్ధిపై చర్చకు రండి: జగన్‌కు మంత్రి సవిత సవాల్

Next Story