- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన వైసీపీ
గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణుల దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్‌రాజ్ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం వైఎస్ జగన్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారని వారు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ తేల్చి చెప్పాయని అన్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు.
ఇంకా మరింత దిగజారి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వైఎస్ జగన్‌తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫోటోలతో, అవే పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫ్లెక్సీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని మా పార్టీ నాయకులు తొలగిస్తే.. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కాకుండా, మా పార్టీ వారిపై పోలీసులు చర్య తీసుకోవడం అత్యంత హేయమన్నారు. కాగా, గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత పక్కనే ఉన్న వివాదాస్పద ఫ్లెక్సీ వద్దకు చేరుకోగా, అప్పటికే కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఆయన కారును అడ్డుకోని దాడికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.






