13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-06 07:52:28  IST  )

భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పనిచేద్దాం.

13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : 2025 సంవత్సరంలో విద్యుత్ రంగంపరంగా అద్భుతంగా పని చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ పేరిట చార్జీలను పెంచితే కూటమి ప్రభుత్వం పాలనలో ట్రూడౌన్ చేస్తున్నాం అన్నారు. అందులో భాగంగా యూనిట్ కు 13 పైసలు ఛార్జీలను తగ్గించగలిగాం అన్నారు. మంగళవారం నిర్వహించిన 14వ ఎస్ఐపీబీ సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు. సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అందుకోసం సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యఘర్ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

అందుకే డేటా సెంటర్లు వచ్చాయి..

2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంతోపాటు... వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయన్నారు. దావోస్ సదస్సుకు వెళ్లి ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగామన్నారు. గూగుల్ సెంటరును ఏపీకి తీసుకురావడానికి మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని.. ఆ కిక్ కోసం అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలని కోరారు.

ప్రముఖ పరిశ్రమల పెట్టుబడులు వచ్చాయి

గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ కూటమి ప్రభుత్వ పాలనలో తిరిగి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి రంగంలోనూ ప్రజాప్రతినిధులు, యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ఇదే విధంగా ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.


Read More..

అటవీశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం

Next Story