- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం
ప్రజల భాగస్వామ్యంతోనే హరిత లక్ష్యాలను చేరుకోగలం.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని (Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్", "50 శాతం గ్రీన్ కవర్" ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న 974 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని తుఫానులు, కోత, పర్యావరణ ముప్పుల నుండి రక్షించేందుకు ఈ 'గ్రీన్ వాల్' ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తీరప్రాంతంలో మడ అడవులు, తాటి చెట్లు, ఇతర స్థానిక వృక్షజాతులను పెంచడం ద్వారా సముద్రపు అలల తీవ్రతను తగ్గించడమే కాకుండా.. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో 50 శాతం పచ్చదనం ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుతూనే, ఖాళీగా ఉన్న అటవీ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద అనేది జాతి సంపద అని, దీని సంరక్షణలో ఎటువంటి రాజీ పడకూడదని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియా పాండే తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణను మంత్రికి వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ హరిత లక్ష్యాలను చేరుకోగలమని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు.
Read More..






