BJP Major Defeat: ఉత్తరాంధ్రలో ఘోర పరాభవం.. ఆ రెండే కారణమా..?

by Disha Web Desk 16 |
BJP Major Defeat: ఉత్తరాంధ్రలో ఘోర పరాభవం.. ఆ రెండే కారణమా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్రలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఓట్ల లెక్కింపులో తొలి నుంచి ఏ రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించలేకపోయారు. ఏడు రౌండ్లు పూర్తి అయ్యే సరికి 10, 884 మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 4 స్థానానికే పరిమితయ్యారు. దీనంతటికి ఉత్తరాంధ్రపై బీజేపీ శీత కన్నేనని కొందరు అంటున్నారు. గడిచిన కాలంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బీజేపీ ఏమీ చేయలేదనే మాట వినిపిస్తోంది. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అపఖ్యాతిని మూటగట్టుకుంది. స్టీల్ ప్లాంట్‌‌ను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రప్రభుత్వ ఆలోచనను ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా విశాఖకు రైల్వే జోన్ కావాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఈ రెండు విషయాల్లో బీజేపీ అస్పష్ట వైఖరిపై ఉత్తరాంధ్ర ప్రజలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఓటు వేయలేదని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.


అటు విశాఖలో బీజేపీకి చెందిన ఎందరో సీనియర్ నేతలు, నాయకులున్నా కూడా వారు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారనే వినికిడి ఉంది. విశాఖ నుంచి 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా హరిబాబు గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌ను గెలిపించాలని ఉత్తరాంధ్రలో ఆయన ప్రచారం చేశారు. అయినా కూడా బీజేపీకి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇటీవల కాలంలో విశాఖలో ఎక్కువసార్లు పర్యటించారు. విశాఖ అభివృద్ధికి కేంద్ర ఏం చేసిందో ప్రజలకు వివరించే ప్రయత్నాలు కూడా చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌ తరపున తీవ్రంగా ప్రచారం చేశారు. కానీ ఇవేవీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు తీసుకురాలేకపోయాయి.


మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినా మాధవ్‌కు మంచి గుర్తింపే ఉంది. పైగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా. అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. ఏపీ బీజేపీ కో కన్వీనర్ సునీల్ ధియోదర్ లాంటి నేత కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. అటు డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు.


కాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 37 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, అందులో 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఉన్నారు. మొత్తం చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వచ్చిన అభ్యర్థికే డిపాజిట్లు వచ్చినట్టవుతుంది. అంటే సుమారు 33 వేల ఓట్లు వచ్చిన వారికి మాత్రమే డిపాజిట్లు లభిస్తాయి. అయితే, పోటీలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభ, టీడీపీ అభ్యర్థి చిరంజీవి, వైసీపీ అభ్యర్థి సుధాకర్‌లకు మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన 34 మంది డిపాజిట్లు కోల్పోయారు.

ఇదిలా ఉంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలో వచ్చే ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బీజేపీ వైఖరి స్పష్టంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా షాక్ తగిలే అవకాశం ఉంటుందని అంటున్నారు. జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


ఇవి కూడా చదవండి:

New Delhi: అరగంటకు పైగా అమిత్‌తో మాట్లాడిన సీఎం జగన్


Next Story

Most Viewed