గాజువాక వివాహిత హత్యకేసులో ట్విస్ట్.. తల ఎక్కడ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-30 03:54:10  IST  )

నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో దారుణ హత్యకు గురైన మౌనిక కేసులో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

గాజువాక వివాహిత హత్యకేసులో ట్విస్ట్.. తల ఎక్కడ?
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలోని గాజువాక ఎల్ వీ నగర్లో ఓ నేవీ ఉద్యోగి ఇంటిలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో.. గతరాత్రి ప్రియురాలు మౌనిక (29)ను ఇంటికి పిలిచిన రవీంద్ర (35) ఆమెను దారుణంగా నరికి చంపిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసింది. ఈ హత్య కేసులో నిందితుడైన రవీంద్రను పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు చెప్పినట్లు సమాచారం. రవీంద్ర ఇంటిలోని ఫ్రిడ్జ్ లో కొన్ని శరీర భాగాలు, ఒక బాక్సులో మరికొన్ని శరీర భాగాలు ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మౌనిక తలతో పాటు మరిన్ని శరీర భాగాలు కనిపించకపోవడంతో షాకయ్యారు. బాధితురాలి తల, మిస్సైన ఇతర శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయని రవీంద్రను ప్రశ్నించగా.. హత్య చేసిన అనంతరం తలను నరికి కాల్చివేసినట్లుగా చెప్పినట్లు సమాచారం. ఆ తల, మిస్సైన పార్ట్స్ ను నిజంగానే కాల్చేసి ఉంటే.. ఆ పని ఎక్కడ చేశాడు? అనే ఆనవాళ్లను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మౌనిక ఫోన్ ను కూడా కాల్చివేసినట్లు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.

ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్రకు, కైలాసపురానికి చెందిన వివాహితురాలు మౌనికకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. భార్య పుట్టింటికి వెళ్లగా ఆదివారం రవీంద్ర ఇంటికి వచ్చిన మౌనిక.. మధ్యాహ్నం వరకూ సఖ్యతగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవ జరగ్గా.. అది చిలికి చిలికి పెద్దది కావడంతో రవీంద్ర కోపంతో ఇంటిలో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపినట్లు తన స్నేహితుడికి తెలిపాడు. ఆపై ఆమె శరీరాన్ని రెండు ముక్కలుగా నరికి సగభాగాన్ని ఫ్రిడ్జ్ లో, మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఒక బాక్సులో పెట్టి ఉంచినట్లు వివరించాడు. రవీంద్ర చేసిన దారుణాన్ని అతని స్నేహితుడు పోలీసులకు తెలుపడంతో విషయం బయటికొచ్చింది. వెంటనే రవీంద్ర ఉన్న అపార్టుమెంటుకు వెళ్లి చూడగా బయట లాక్ చేసి ఉంది. దీంతో రవీంద్ర ఫోన్ ను ట్రాప్ చేసి, అతను ఉన్న లొకేషన్ ను కనుగొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా సమాచారం. డబ్బు కోసం తీవ్రంగా వేధించడం వల్లే హతమార్చినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా.. మౌనిక భర్త, ఆమె బంధువులు ఈ హత్యపై ఇంతవరకూ స్పందించలేదని తెలుస్తోంది.

రాష్ట్రంలో దారుణం.. యువతిని ముక్కలు ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి!

Next Story