మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులకు టీడీపీ మద్దతు : MP లావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-17 08:23:59  IST  )

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు టీడీపీ మద్దతు తెలిపింది.చట్టసభల్లో మహిళల గొంతుక వినిపించాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆకాంక్షించారు.

మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులకు టీడీపీ మద్దతు : MP లావు
X

దిశ, వెబ్‌డెస్క్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక బిల్లుకు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై స్పష్టత

డీలిమిటేషన్ ప్రక్రియపై పలు రాజకీయ పార్టీలు వ్యక్తపరుస్తున్న అనుమానాలపై ఆయన స్పందించారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతుందనే ఆందోళన ఉందని, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టడాన్ని టీడీపీ వ్యతిరేకించడం లేదని ఆయన తెలిపారు. దేశాభివృద్ధిలో అన్ని ప్రాంతాల భాగస్వామ్యం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళల చిరకాల స్వప్నం ఈ బిల్లుతో నెరవేరబోతోందని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చట్టసభల్లో మహిళల గొంతుక మరింత బలంగా వినిపించేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దశాబ్దాలుగా నలుగుతున్న ఈ బిల్లు అమలులోకి రావడం హర్షణీయమని ఆయన కొనియాడారు.

రాజ్యాంగ సవరణల ప్రాముఖ్యత

131వ రాజ్యాంగ సవరణ గురించి దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయని, ప్రపంచంలోని పలు దేశాల్లో రాజ్యాంగ మార్పులు సాయుధ పోరాటాలకు దారితీసిన ఉదాహరణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ, భారతదేశం ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా ఈ మార్పులను ఆహ్వానిస్తోందని, అందుకే భారత్ వర్ధిల్లుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతకు ఈ బిల్లు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై.. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ కీలక నిర్ణయం

Next Story