ఆర్డీటీకి లైన్ క్లియర్.. మంత్రి నారా లోకేష్ కు మాంచో ఫెర్రర్ కృతజ్ఞతలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-25 04:24:37  IST  )

ఆర్డీటీ విదేశీ నిధుల అడ్డంకులను తొలగించిన లోకేష్. లక్షలాది పేదలకు మళ్లీ అందనున్న విద్య, వైద్యం. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్

ఆర్డీటీకి లైన్ క్లియర్.. మంత్రి నారా లోకేష్ కు మాంచో ఫెర్రర్ కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అండగా నిలుస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కి ఎదురైన నిధుల అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) కింద నిలిచిపోయిన నిధుల రాకను పునరుద్ధరించడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి లోకేష్ అభయం

గతంలో కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద కొన్ని నిబంధనల కారణంగా ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధులను నిలిపివేసింది. దీంతో సంస్థ నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని మాంచో ఫెర్రర్ గతంలోనే నారా లోకేష్ దృష్టికి తీసుకురాగా, "లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ" అని లోకేష్ అభయమిచ్చారు. చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి, అడ్డంకులను తొలగించి నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.

లోకేష్‌ను కలిసిన సందర్భంగా మాంచో ఫెర్రర్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక మంత్రికి చెబుతున్న కృతజ్ఞత కాదని, ఆర్డీటీ తరపున లక్షలాది మంది పేద ప్రజలు ఒక మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులు అని భావోద్వేగంతో పేర్కొన్నారు. లోకేష్ తనదైన శైలిలో మంత్రాంగం నడిపి, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశారని కొనియాడారు. ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చేయడంలో లోకేష్ చూపిన చొరవ అభినందనీయమని ఆయన అన్నారు.

ఆర్డీటీ కృషి అనన్యసామాన్యం

దీనిపై స్పందించిన నారా లోకేష్, ఆర్డీటీ చేస్తున్న నిస్వార్థ సేవలతో పోలిస్తే తాను చేసిన పని చాలా చిన్నదని వినమ్రంగా చెప్పారు. నిరుపేదలకు అందని చదువులను అందించే విద్యాలయంగా, పైసలు లేని వారికి ప్రాణం పోసే ఆరోగ్యాలయంగా ఆర్డీటీ చేస్తున్న కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆర్డీటీ వంటి సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

సీఎం చొరవతో ఆర్డీటీకి మోక్షం: పేదలకు నిరాటంకంగా సేవలు : మాంచో ఫెర్రర్








Next Story