కాలుష్య రహిత గోదావరి పుష్కరాలు.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-29 14:44:46  IST  )

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కాలుష్య రహిత గోదావరి పుష్కరాలు.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ.. ఎక్కడెక్కడ గోదావరి నది కలుషితమవుతుందో గుర్తించి.. ఆయా ప్రాంతాల అధికారులకు వెంటనే వాటిని సరిదిద్దాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య రహిత పుష్కరాల కోసం కార్యాచరణ ప్రణాళిక జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించామని, వాటిని మురుగునీటి రహిత పంచాయతీలుగా చక్కదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మురుగునీరు గోదావరిలో కలువకుండా.. ప్రత్యేక పర్యవేక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీల సామర్థ్యాలకు అనుగుణంగా.. మురుగుశుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పవన్ సూచించారు. అలాగే పీసీబీ నుంచి మంజూరు చేసిన రూ.100 కోట్ల నుంచి కూడా నిధులను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్య నివారణకు నిరంతరం తనిఖీలు జరుగుతాయని, ఆర్టీజీఎస్ సహా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం ప్రత్యక్ష పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కు కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలను అప్పగించామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.

గోదావరిలోకి మురుగు నీరు చేరొద్దు: పవన్ కల్యాణ్ ఆదేశం

Next Story