మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

by Ramesh Naini |   (  Updated:2026-02-06 10:50:10  IST  )

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటనపై పోలీసుల ఆంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్‌కు, అకస్మాత్తుగా తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.

రూట్ మ్యాప్‌పై అభ్యంతరం!

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరాల్సి ఉంది. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకునేలా రెండు రోజుల క్రితమే వైసీపీ నేతలు పోలీసులకు రూట్ మ్యాప్‌ను అందజేసినట్లు చెబుతున్నారు. అయితే, పర్యటనకు కొన్ని గంటల ముందు విజయవాడ సీపీ స్వయంగా నోటీసులు జారీ చేస్తూ, భద్రతా కారణాల దృష్ట్యా రూట్ మార్చాలని సూచించడం సంచలనంగా మారింది.

గుంటూరు పర్యటన ఎఫెక్టేనా?

బుధవారం గుంటూరు పర్యటనలో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టింది. అంబటి ఇంటిపై జరిగిన దాడుల నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ను చూసేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చింది. ఈ నేపథ్యంలోనే, విజయవాడ పర్యటనకు కూడా భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు, ట్రాఫిక్, భద్రతా నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పరామర్శకు పక్కా ప్రణాళిక

టీడీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్న తమ పార్టీ నేతలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే రేపు జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వం కావాలనే ఆంక్షలతో తమ పర్యటనను అడ్డుకోవాలని చూస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసుల నోటీసుల నేపథ్యంలో జగన్ పర్యటన ఏ మార్గంలో సాగుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

జగన్ గుంటూరు పర్యటన.. ఐదుగురు నేతలపై కేసులు నమోదు

Next Story