కన్‌ఫ్యూజ్ చేస్తున్న పవన్ కల్యాణ్.. కొత్తగా తెరపైకి మరో కార్యక్రమం..!

by GSrikanth |
కన్‌ఫ్యూజ్ చేస్తున్న పవన్ కల్యాణ్.. కొత్తగా తెరపైకి మరో కార్యక్రమం..!
X

పవన్​ కల్యాణ్ వ్యూహం ఏంటని ఓ వీడియోలో​విశ్లేషకుడిని యాంకర్ అడిగితే.. గందరగోళ వ్యూహం అంటూ ఠక్కున చెప్పేశాడు. ఇంతకీ జనసేనాని గందరగోళంలో ఉన్నారో.. కావాలనే ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారో తెలీదు. ఇప్పటిదాకా ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారో ప్రకటించలేదు. పొత్తు బీజేపీతో మాత్రమేనా లేక టీడీపీతో కూడా ఉంటుందా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇవన్నీ పక్కనపెడితే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పడం లేదు. అసలు జనసేన మేనిఫెస్టో ఏంటో ఆ పార్టీ నాయకులకే అర్థం కావడం లేదు. పదేళ్ల అనుభవం గడించా.. సీఎం అయ్యే అర్హత సాధించా. అవకాశమివ్వాలని మాత్రం సభల్లో అడుగుతున్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం కావాలంటారు. అదెలా సాధ్యమో అర్థంగాక జనం జుట్టు పీక్కుంటుంటే కొత్తగా ప్రజా కోర్టు అనే కార్యక్రమానికి తెరదీసినట్లు జన సైనికులు చెబుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ ఆవిర్భవించి దశాబ్ద కాలమవుతున్నా ఇప్పటికీ క్షేత్ర స్థాయికి పార్టీ నిర్మాణం విస్తరించలేదు. పవన్ అభిమానులే జెండాలు పట్టుకొని కనిపిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు ఓ దిశా నిర్దేశమంటూ లేదు. పార్టీకంటూ ఓ కార్యక్రమమే లేదు. కాస్త ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు స్థానిక ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది టీవీ చానళ్ల చర్చల్లో పాల్గొంటున్నారు. అంతకుమించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై స్పందన లేదు. వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.. దోపిడీని ఆపాలనేదే నినాదం. సీఎంగా ఒక్క అవకాశమివ్వాలని అడుగుతున్నారు. జనం సమస్యలకు పరిష్కారం చూపకుండా ఓట్లు ఎలా వేస్తారు ? పోనీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది కూడా చెప్పకుండా ఎలా మద్దతిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తొలుత రోడ్ల దుస్థితిపై..

చాలా ఏళ్లపాటు సినిమాలకే పరిమితమైన పవన్ కల్యాణ్​తొలుత అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లపై ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున డిజిటల్​క్యాంపెయిన్​ నిర్వహించారు. ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చారు. అనంతరం అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులకు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. దీంతో ప్రభుత్వం కూడా కదిలి కొన్ని కుటుంబాలకు సాయం అందించింది. జనవాణి పేరుతో గ్రీవెన్స్​నిర్వహిస్తున్నారు. అన్యాయానికి, ప్రభుత్వ నిరాదరణకు గురైన కుటుంబాలను కలుసుకోవడం ద్వారా తానున్నాననే ఓ భరోసానిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా ప్రజా కోర్టు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఒక్క అవకాశం ఇవ్వాలంటూ..

వారాహి యాత్రల పేరుతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖలో పవన్ పర్యటించారు.​ సభలకు పెద్ద సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. ఈ సభల్లో సహజ వనరులను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని పవన్ దుయ్యబట్టారు. శాంతిభద్రతలు మృగ్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని నినదించారు. సీఎంగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అర్థించారు. అంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిని ఎలా పరిష్కరిస్తామనేది జనసేనాని చెప్పలేక పోయారు.

సమస్యలు కనిపించ లేదా..?

రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇసుక, సిమెంటు, స్టీలు​ ధరలు పెరగడంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేకవలసపోతున్నారు. నేతన్నల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల​ధరలు సగటు ప్రజలకు భరింపశక్యం కావడం లేదు. కరెంటు, రవాణా చార్జీల మోత ఎక్కువైంది. ఓవైపు విశాఖ స్టీల్​ ప్లాంటును అమ్మొద్దంటూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్యాకేజీ ఇవ్వలేదు. పోలవరం అగమ్యగోచరమైంది. విభజన హామీలు ఏమయ్యాయని కేంద్రాన్ని నిలదీసే నాయకులే కనిపించడం లేదు. మొత్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం చూపడంలో ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యం కనిపిస్తోంది. మరి జనసేనాని లక్ష్యం ఎలా నెరవేరుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి పురుడుపోసుకున్నట్లు చెప్పుకుంటున్న పార్టీనే ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేయడం విశేషం.

Next Story

Most Viewed