పేదల పెన్నిధి నందమూరి తారకరామారావు : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-18 05:16:54  IST  )

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్.

పేదల పెన్నిధి నందమూరి తారకరామారావు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. నట సార్వభౌమ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు.

పేదల పెన్నిధి : సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను స్మరించుకున్నారు. ఎక్స్ వేదికగా ఘన నివాళిని అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కారణజన్ములని, యుగ పురుషులని, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని తెలిపారు. ఆయన వేసిన బాట అనుసరణీయమని స్పష్టం చేశారు.

తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా : మంత్రి నారా లోకేశ్

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు మనవడైన మంత్రి నారా లోకేశ్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఆప్యాయతను తెలియజేసేలా ఎక్స్ వేదికగా భావోద్వేగాన్ని ప్రజలతో పంచుకున్నారు. భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా! అంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. ఆయన పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడుతూ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ప్రత్యక్షంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఎన్టీఆర్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

Read More..

ఎన్టీఆర్ చివరి కోరిక అదే.. ఏపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయ్.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్

Next Story