చిలుకూరులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం సీతారాంపురం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

చిలుకూరులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం సీతారాంపురం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు ప్రయాణికులతో వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన సిమెంట్ లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కిందివైపు దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలకు గురైనట్లు సమాచారం.

గాయపడిన వారికి స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి చికిత్స అందించారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి సిమెంట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story