- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానలు కురవాలి.. కొత్తకొండ వీరభద్రుడికి మంత్రి పొన్నం అభిషేకం, వరుణయాగం!
హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

దిశ, భీమదేవరపల్లి: హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించిన మంత్రి గ్రామ వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. స్థానికులను పలకరిస్తూ వారి యోగక్షేమాలు, గ్రామంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ వరుణయాగం, యజ్ఞయాగాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి 108 కలశాలతో మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటి మహిమాన్వితమైన క్షేత్రమని, ఈ ప్రాంత ప్రజలకు అపార విశ్వాసం కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా బోనాల సందర్భంగా కూడా అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, జాలి ప్రమోద్ రెడ్డి, సిద్దమల్ల రమ రమేష్, గోపగాని తిరుపతి, కాల్వ శ్రావణ్ కుమార్, ఈవో కిషన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల అనిల్, సీనియర్ నాయకులు మంగ రామచంద్రం, ఉసకోయిల ప్రకాష్, కొలుగూరి రాజు, ఆదరి రవిందర్, చంద్రశేఖర్ గుప్తా, చిట్కూరి అనిల్, పోగుల శ్రీకాంత్ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, మొగిలి పాలెం రాంబాబు, వినయ్ శర్మ, సందీప్,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






