కాంగ్రెస్ ధర్నాలు రాజకీయ డ్రామాలే: రేవంత్ సర్కార్, రాహుల్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ధ్వజం

by Malleboina Mahesh |   (  Updated:2026-07-22 07:19:04  IST  )

నీట్ పరీక్ష అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ధర్నాలు రాజకీయ డ్రామాలే: రేవంత్ సర్కార్, రాహుల్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ధ్వజం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ధర్నాలను రాజకీయ డ్రామాలు అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ను అసలు ప్రతిపక్షంగానే ప్రజలు గుర్తించడం లేదని, కేవలం రాజకీయ నాటకాలతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. సీజేపీ (కాక్రోచ్ పార్టీ)తో పోటీ పడేందుకే కాంగ్రెస్ ఇటువంటి ధర్నాలకు దిగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రాహుల్ గాంధీ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం బీజేపీకే లాభమని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీపై తాము దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని, ప్రధాని నివాసం ముందు ధర్నా పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. నీట్ (NEET) వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ డ్రామాలు ఆపి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

మరోవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న ధర్నాలు పెద్ద జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని రేవంత్ అనడం విడ్డూరంగా ఉందన్న ఆయన, రాహుల్ ప్రధాని కావడం దేవుడెరుగు.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కూడా కల అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పొలాల్లో నారు ఎండిపోయి, ఎరువులు అందక రైతులు అల్లాడుతుంటే సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ఫెయిల్ కావడంతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కార్ ఈ నిరసన డ్రామాలకు తెరదీసిందని ఆరోపించారు. ఇకనైనా ఆందోళనలు ఆపి, రైతుల పంటలకు సాగునీరందించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నాంపల్లి టూ గాంధీభవన్.. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ ర్యాలీ

Next Story