ఇరిగేషన్ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం.. ఉదయం 10:57 గంటలు దాటినా ఖాళీగా సీట్లు!

by Jakkula.Mamatha |

ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో సమయపాలన ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇరిగేషన్ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం.. ఉదయం 10:57 గంటలు దాటినా ఖాళీగా సీట్లు!
X

దిశ,సూర్యాపేట: ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో సమయపాలన ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు నిర్ణీత సమయానికి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఉదయం 10:57 గంటలు దాటిన పలువురు ఉద్యోగులు కార్యాలయానికి రాకపోవడంతో తమ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం నుంచే రైతులు, ఆయకట్టు రైతు సంఘాల ప్రతినిధులు, వివిధ పనుల నిమిత్తం వచ్చిన బాధితులు కార్యాలయం వద్ద వేచి ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. కార్యాలయ సమయానికి ఉద్యోగులు హాజరు కాకపోవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడం ఉద్యోగుల బాధ్యత అయినప్పటికీ, కొందరు ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో కార్యాలయానికి వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తమ పనుల కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ప్రజల సమయానికి విలువ ఇవ్వకుండా సమయపాలనను గాలికొదిలేయడం ప్రభుత్వ సేవల పై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయం సమయాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Next Story