- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ కుంభకోణం కోసం దస్తగిరిని బలితీసుకున్నారు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ జిల్లాలో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత పార్టీ కార్యకర్త హత్యకు గురైతే, మూడు రోజులుగా పులివెందలలోనే ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం పరామర్శించకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.
భూ కుంభకోణమే హత్యకు కారణమా?
ఈ హత్యకు వెనుక భారీ భూ దందాలు ఉన్నాయని భూమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిలు దస్తగిరి పేరుతో వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులు, భూ దందాలు నిర్వహించారని ఆరోపించారు. ఫ్యాక్టరీలు, గనులు లేని రవీంద్రనాథ్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రభుత్వం విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
హత్యను తప్పుదారి పట్టిస్తున్నారు..
పెద్ద తలకాయలను కాపాడటం కోసమే ఈ దారుణ హత్యను గంజాయి బ్యాచ్ గొడవగా లేదా అనుమానాస్పద మృతిగా చిత్రీకరించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని భూమిరెడ్డి విమర్శించారు. "ఒకప్పుడు బాబాయ్ వివేకాను గొడ్డలితో చంపించారు.. ఇప్పుడు వందల కోట్ల భూ కుంభకోణం బయటపడుతుందనే భయంతో పెద్ద దస్తగిరిని బలితీసుకున్నారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్యకు కారణమైన వారే ఇప్పుడు పరామర్శల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
జగన్‌కు ఎమ్మెల్సీ బహిరంగ సవాల్
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్ వైఫల్యాన్ని భూమిరెడ్డి ఎండగట్టారు. 2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ఒక్క ఆయకట్టుకు అయినా కొత్తగా నీరు ఇచ్చినట్లు నిరూపిస్తే, తన శాసనమండలి సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తానని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం అక్రమ ఆస్తుల సంపాదనపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు.






