- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kandula Durgesh: ఇదే సరైన సమయం.. ఏపీకి రండి.. !
ఇదే సరైన సమయం అని, రాష్ట్రానికి రావాలని పెట్టుబడిదారులను మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం పలికారు...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 (ఎస్ఏటీటీఈ) వేదికగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో ప్రసంగించి ఇన్వెస్టర్లను అమితంగా ఆకట్టుకున్నారు.
పెట్టుబడిదారులకు భరోసా కల్పించిన మంత్రి దుర్గేష్
పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకరంగానికి కూడా వర్తింపజేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో పర్యాటకాభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీ 2024-29 తీసుకువచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్లు, యాంకర్ హబ్‌లు, థీమాటిక్ అప్రోచ్ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన తదితర విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. అందమైన దృశ్య కావ్యానికి ప్రతీకగా నిలిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి పర్యాటక రంగంలో విస్తృతమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని వివరించి ఇన్వెస్టర్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెలర్స్, ఔత్సాహికులను ఆహ్వానించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు, వనరులున్న నేపథ్యంలో వాటన్నింటిని సమర్థవంతంగా వినియోగించుకొని పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రపథాన నిలుపుతామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకాన్ని, పర్యావరణాన్ని సమ్మిళితం చేసి యువతకు ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధిలో భాగంగా పర్యాటకులకు విభిన్న పర్యాటక అనుభవాలను కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఒకే తరహా పర్యాటకాభివృద్ధి కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను అవలంభించాలని నిర్ణయించామన్నారు. హబ్ అండ్ స్కోప్ విధానంలో యాంకర్ హబ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పర్యాటకుల భద్రత తమ బాధ్యత: మంత్రి దుర్గేష్
పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగం ద్వారా 15 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఆహ్లాదంగా ఉంటూ ఎక్కువ రోజులు గడిపేలా మెరుగైన సేవలు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
ఏపీకి దార్శానికత, ముందుచూపు, అత్యంత అనుభవం కలిగిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువత సాధికారత కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని వివరించారు. వీరిద్దరూ ఆర్థిక, మౌలిక వసతుల పురోభివృద్ధికి, ఉపాధి కల్పనకు కట్టుబడి సుస్థిర పర్యావరణ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సహకారం, సమన్వయం అవసరమని మంత్రి దుర్గేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలుపుతూ జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. అదే విధంగా అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామా అయిన ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కోరారు.
ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ - 2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానం పలకడం జరిగింది.సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు… pic.twitter.com/VxrivvNZPB— Kandula Durgesh (@kanduladurgesh) February 19, 2025






