Ap Special Strory: అమరావతికి జగన్ అనుకూలమా?.. వ్యతిరేకమా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-28 15:08:15  IST  )

ఏపీ రాజధాని విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాలను శరవేగంగా నిర్మిస్తోంది...

Ap Special Strory:  అమరావతికి జగన్ అనుకూలమా?.. వ్యతిరేకమా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాలను శరవేగంగా నిర్మిస్తోంది. అయితే రాజధాని విషయంలో గతంలో జరిగిన తప్పులకు మరోసారి అవకాశం కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవం తీర్మానం చేసింది. అయితే గత ఐదేళ్లుగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. "జగన్ అమరావతికి అనుకూలమా? లేక వ్యతిరేకమా?". ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో అదే ప్రశ్న మళ్లీ వైరల్ అవుతోంది.

ఆరంభంలో 'జై'.. అధికారంలో 'నై'!

అమరావతికి జగన్ అనుకూలమా వ్యతిరేకమా అంటే ఇందుకు ఒక్క ముక్కలో ఆశ్సర్ దొరకదు. ఎందుకంటే ఇది భావోద్వేగాలకి, రాజకీయ వ్యూహాలకి మధ్య ఆరేళ్లుగా జరిగిన ఒక పెద్ద యుద్ధం. ఆరంభంలో ‘జై’ కొట్టి ఆ తర్వాత ‘నై’అనే అడ్డం తిరిగిన కథ అందిరికీ తెలిసింది. ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ తర్వాత అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం ప్రకటించినప్పుడు విపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా "రాజధాని కనీసం 30 వేల ఎకరాల్లో ఉండాలి. నేను దీనిని స్వాగతిస్తున్నా" అని ప్రకటించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చాక సీన్‌ను పూర్తిగా మార్చేశారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే ఈ రాజధానులు అంటూ అసెంబ్లీ వేదికగా తీర్మానం చేశారు. దీంతో ఒక్కసారిగా వ్యతిరేకత పెరిగింది.

వ్యతిరేకతకు పునాది: 'మూడు రాజధానులు'

అయితే జగన్ తీసుకున్న "వికేంద్రీకరణ" నిర్ణయం అమరావతికి శాపంగా మారిందని ఆయన వ్యతిరేకులు భావించారు. కేవలం శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలుగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. అయితే ఈ ప్రతిపాదనతో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చూడటానికి జగన్ నిరాకరించారు. దీని వెనుక ఉన్నది ప్రాంతీయ సమానత్వం అని జగన్ వర్గం వాదిస్తే, ఇది కేవలం మునుపటి ప్రభుత్వంపై కక్ష అని ప్రత్యర్థులు విమర్శించారు.

జగన్ వాదన ఏమిటి?

జగన్ మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా వ్యతిరేకించలేదని ఆయన మద్దతుదారులు అంటారు. అయితే ఒకే చోట లక్షల కోట్లు కుమ్మరించడం కంటే, ఉన్న వనరులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఉత్తమమని హితవు పలికారు. అంతేకాదు అమరావతి అనేది ఒక గ్రాఫిక్స్ అని, అక్కడ మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రం అప్పులపాలవుతుందని జగన్‌తో పాటు అనుచరులు, వైసీపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఒకే రాజధాని నిర్మాణం కంటే 'నవరత్నాలు' లాంటి సంక్షేమ పథకాలు బెటర్ అని జగన్ కూడా నమ్మారు.

అమరావతి రైతుల ఆగ్రహం

కానీ అమరావతికి జగన్ వ్యతిరేకి అనే ముద్ర పడింది.. ఇందుకు కారణం అక్కడ భూములిచ్చిన రైతులే. వేల రోజులకు పైగా సాగిన రైతుల పోరాటం, పాదయాత్రలు జగన్ ప్రభుత్వ మొండితనాన్ని ప్రశ్నించాయి. అమరావతిని ఒక 'రియల్ ఎస్టేట్ మాఫియా'గా జగన్ అభివర్ణించడం రైతుల మనోభావాలను దెబ్బతీసింది.

అనుకూలమా? వ్యతిరేకమా?

నిజానికి అమరావతి చుట్టూ ఉన్న రాజకీయ ప్రాభల్యానికి, అక్కడ పెట్టిన ఖర్చుకు జగన్ ఖచ్చితంగా వ్యతిరేకిగానే నిలిచారు. అమరావతిని ఒక "భ్రమ"గా చూశారే తప్ప.. రాష్ట్ర ఆత్మగౌరవంగా చూడలేకపోయారనేది రాజకీయ సత్యం. దీంతో అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా చేస్తున్న కృషిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలన చేసుకుంటున్నారు. ఇకనైనా మనసుమార్చుకుని అమరావతికి జై కొడతారా.. లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకూ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. రేపో, ఎల్లుండో కేంద్రానికి పంపనుంది. మరి ఏం జరుగుతుందో.

జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు.. మంత్రి నారా లోకేశ్ సెటైర్లు

Next Story