లోకేశ్ అరెస్ట్ తప్పదా ? ఢిల్లీలో ఏం జరుగుతోంది?

by Seetharam |   (  Updated:2023-09-24 10:37:46  IST  )

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నెక్ట్స్ అయ్యేది నారా లోకేశేనా? ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు మోస్తున్న చినబాబు అరెస్ట్ తప్పదా?

లోకేశ్ అరెస్ట్ తప్పదా ? ఢిల్లీలో ఏం జరుగుతోంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నెక్ట్స్ అయ్యేది నారా లోకేశేనా? ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు మోస్తున్న చినబాబు అరెస్ట్ తప్పదా? లోకేశ్ అరెస్ట్‌కు సీఐడీ కసరత్తు మెుదలు పెట్టిందా? ఈ విషయాన్ని ముందే గమనించిన లోకేశ్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారా? అందుకే మళ్లీ యువగళం పాదయాత్రను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారా? ఇప్పటికే ఒకవైపు వైసీపీ నేతలు సైతం తర్వాత అరెస్ట్ అయ్యేది లోకేశ్ అంటూ పదేపదే హింట్ ఇస్తోందా?. అంతేకాదు లోకేశ్ మీ లొకేషన్ ఎక్కడా అంటూ ఎద్దేవా చేయడం..తల్లిని, భార్యని వదిలేసి ఢిల్లీ ఎందుకు పారిపోయావ్ అంటూ వైసీపీ నిలదీతల వెనుక మతలబు ఏంటి? సీఐడీ సైతం ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం లోకేశ్ అరెస్ట్ ఖాయమనేనా? ఈ ప్రశ్నలపై ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభించబోతున్నారనే వార్తల నేపథ్యంలో లోకేశ్ అరెస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది.అసలు లోకేశ్ అరెస్ట్‌పై ఏపీ రాజకీయాల్లో ఏం చర్చ జరుగుతుందో ఓ సారి చూద్దాం.

కాక రేపుతున్న పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు కాకరేపుతున్నాయి. అసలే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హీటెక్కిన పాలిటిక్స్ చంద్రబాబు అరెస్ట్‌తో మరింత హీటెక్కాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి కోలుకోలేని దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 40 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో చంద్రబాబు ఒక్కసారి కూడా జైలు కెళ్లింది లేదు. చంద్రబాబుపై కేసులుఉన్నప్పటికీ స్టేలు తెచ్చుకున్నారే తప్ప ఏనాడు కోర్టు మెట్లెక్కిన పరిస్థితి లేదు. అలాంటిది స్కిల్ స్కామ్ కేసులో ఏకంగా రిమాండ్‌కు వెళ్లారు. ఏకంగా 15 రోజులుగా జైల్లో మగ్గుతున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో పార్టీ బాధ్యతలు టీడీపీ చినబాబుగా చెప్పుకొనే లోకేశ్‌పై పడింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన పలు నిర్ణయాలు లోకేశ్ తీసుకుంటున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో జాతీయ స్థాయిలో తమ పోరాటాన్ని తెలియజేసేందుకు లోకేశ్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ పారిపోయారంటూ విమర్శలు

ఢిల్లీ వేదికగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై పోరాటం చేయాలని లోకేశ్ హస్తినకు వెళ్లారు. కానీ లోకేశ్ పాచిన పాచిక సరిగ్గాప పారలేదని తెలుస్తోంది. జాతీయ స్థాయి మీడియాకు చంద్రబాబు అరెస్ట్ ఇతర అంశాల గురించి తెలియజేయడంలో ఫెయిల్ అయ్యారనే విమర్శలు సైతం ఉన్నాయి.ఇదే తరుణంలో పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో ఢిల్లీకి వెళ్ళాడని వైసీపీ ఆరోపిస్తోంది. అంటే లోకేష్ అరెస్ట్ కూడా తప్పదని స్పష్టంగా అర్థం అవుతోంది. ఎందుకంటే ఈ స్కిల్ డెలవప్ మెంట్ కేసులో లోకేశ్‌కు కూడా సంబంధం ఉందని సీఐడీ ఆరోపిస్తోంది.లోకేశ్ మంత్రిగా ఉండి ఇందులో పాలు పంచుకున్నట్టు సీఐడీ చెప్తోంది. ఏపీ సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్తే చాలు ఇక లోకేశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు వైసీపీ సైతం లోకేశ్ అరెస్ట్ ఖాయమంటూ చెప్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ఆ తర్వాత అచ్చెన్నాయుడులను సీఐడీ అదుపులోకి తీసుకోవడం ఖాయమని మంత్రులు కోడై కూస్తున్నారు. అందుకే లోకేశ్ తల్లిని, భార్యను సైతం వదిలేసి ఢిల్లీకి పారిపోయాడని విమర్శలు చేస్తోంది.

లోకేశ్ కదలికలపై సీఐడీ ఆరా?

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ నారా లోకేశ్ అరెస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లోకేశ్‌ ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల్లో కూడా లోకేశ్ పాత్ర ఉందని సీఐడీ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో లోకేశ్ మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ పాత్రను సీఐడీ పదేపదే ప్రస్తావిస్తోంది. కిలారును లోకేషే బినామీగా ప్రవేశపెట్టారని సీఐడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి పలు ఆధారాలు సేకరించిందని అయితే అవి అరెస్ట్ చేసేందుకు సరిపోవని ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారించి ఆధారాలు సేకరించే పనిలో సీఐడీ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో లోకేశ్ కదలికలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది. లోకేశ్‌ కేసు విషయంలో ముందుకు ఎలా వెళ్లాలి అనే దానిపై కూడా సుప్రీంకోర్టు లీగల్ టీం తో ఏపీ సీఐడీ పోలీసులు చర్చించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. మెుత్తానికి లోకేశ్ అరెస్ట్‌ ప్రచారంలో వాస్తవం ఉందా? అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read More..

బ్రేకింగ్: ఫస్టాఫ్ కంప్లీట్.. చంద్రబాబుకు గంట లంచ్ బ్రేక్..!

చంద్రబాబు ఫ్యామిలీని చంపేందుకు కుట్ర: మాజీమంత్రి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Next Story