పల్లెకు పోదాం చలో చలో.. నందిగామ వైజంక్షన్‌ వద్ద భారీగా వాహనాల రద్దీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-10 09:53:57  IST  )

నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో ఉద్యోగులు సొంతవాహనాల్లో పట్టణాల నుంచి పల్లె బాట పట్టారు.

పల్లెకు పోదాం చలో చలో.. నందిగామ వైజంక్షన్‌ వద్ద భారీగా వాహనాల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో ఉద్యోగులు సొంతవాహనాల్లో పట్టణాల నుంచి పల్లె బాట పట్టారు. ఏడాదికొకసారి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతిని పేరెంట్స్, చుట్టాలందరితో కలిసి జరుపుకునేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు ప్రయాణికుల రద్దీ పెరిగిందని, సాయంత్రానికి రేపు, ఎల్లుండి మరింత రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సైతం టికెట్లు అందుబాటులో లేకపోవడంతో.. ఎలాగైనా సరే ఊరువెళ్లాలని దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

మరోవైపు పంతంగి, కీసర టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ దర్శనమిస్తోంది. విజయవాడ - హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు స్లోగా కదులుతున్నాయి. అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాలేదు. దీంతో సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి.

కిక్కిరిసిన NH65.. ఈ రూట్ బెటర్

పండగకు సొంతూరికి వెళ్తున్న వాహనాలతో శనివారం ఉదయం నుంచి నేషనల్ హైవే 65 కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ దర్శనమిస్తోంది. వేలాదిమంది ఒకేసారి ఊళ్లకు బయల్దేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు హైవేపై నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. దీంతో గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు విజయవాడ హైవేకు బదులుగా నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి బొంగుళూరు గేట్ ఎగ్జిట్ నుంచి సాగర్ హైవేలోకి రాకుండా.. ఆయా మార్గాల్లో వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్నారు. ఖమ్మం, విజయవాడ వెళ్లేవారు భువనగిరి మీదుగా వెళ్లడం బెటరంటున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చని, అక్కడి నుంచి నార్కట్ పల్లి దాటితే ట్రాఫిక్ తగ్గుతుందని చెప్తున్నారు.

READ MORE .....

పండగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్: హైదరాబాద్ - విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు!

Next Story