- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా అడ్డంకులు తొలగించండి: పోలవరం పూర్తిపై కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన ఆయన, ప్రాజెక్టు పనుల్లో నెలకొన్న సాంకేతిక, ఆర్థిక అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 2011 నుంచి అమలులో ఉన్న 'స్టాప్ వర్క్ ఆర్డర్'ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని, తద్వారా పనులు వేగంగా సాగుతాయని వివరించారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ, ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తయ్యాయని కేంద్రానికి నివేదించారు.
కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపు
రాష్ట్రంలోని సాగునీటి అవసరాల దృష్ట్యా పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ అదనపు పనులకు సంబంధించిన నిధులను రీఎంబర్స్ చేయడంతో పాటు, ప్రాజెక్టు తదుపరి పనులకు అవసరమైన బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే 'హర్ ఖేత్ కో పానీ' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. కాలువల ఆధునీకరణ, పూడిక తీత వంటి పనుల ద్వారా రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం
రాష్ట్ర జల ప్రయోజనాల రక్షణపై కూడా సీఎం చంద్రబాబు గట్టిగా గళమెత్తారు. కృష్ణా నదిపై ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచే విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వవద్దని, కర్ణాటక చేపడుతున్న అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలని కోరారు. ఒకవేళ ఆనకట్ట ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. అదే సమయంలో గోదావరి వరద జలాలను రాయలసీమ, దక్షిణ కోస్తాకు తరలించేలా 'పోలవరం-బనకచర్ల' లింక్ ప్రాజెక్టుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వివరించారు.
గెజిట్ ప్రకారమే ముందుకు వెళ్తాం
వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ ప్రకారం తాము ముందుకు వెళ్తామని సీఎం తెలిపారు. ఏపీ అవసరాల కోసం 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో హెడ్ స్లూయిస్ నిర్మిస్తామని, ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఏపీని జలవనరుల పరంగా సుసంపన్నం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఈ భేటీలో స్పష్టం చేశారు.






