- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం చంద్రబాబు
దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధియే తన అజెండా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధియే తన అజెండా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక రంగం, ఆర్థిక సంస్కరణలు, ఏపీ భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సంస్కరణల బాటలో అన్ స్టాపబుల్ భారత్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. "సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. మోదీ జీ సూచించిన 8 అంశాల నేషనల్ మిషన్‌ను మనం విజయవంతం చేయాలి. గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్ సాధించడమే మన లక్ష్యం కావాలి" అని ఆయన పిలుపునిచ్చారు. 1990లలో వచ్చిన ఆర్థిక సంస్కరణల్లో తాను కూడా భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని, ఇప్పుడు టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే అంశాలపై ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఏపీ ఆర్థిక లక్ష్యాలు - భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఆయన పక్కా ప్రణాళికను వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గడిచిన 22 నెలల్లో ఏపీ రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 24 లక్షల ఉద్యోగాలను సృష్టించగలిగిందని వెల్లడించారు. దేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో 160 గిగావాట్లను ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 30 పైసలు తగ్గించామని, త్వరలోనే దానిని రూ.1.30 వరకు తగ్గించేలా పనిచేస్తున్నామని చెప్పారు.
అమరావతి - ఫ్యూచర్ టెక్ సిటీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని 'టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సిటీ'గా నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నెట్ జీరో కాన్సెప్ట్‌తో పాటు, అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయని, రిలయన్స్ వంటి సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని గుర్తుచేశారు.
పీపీపీ మోడల్ - ఎంప్లాయబిలిటీ మిషన్
పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పట్టభద్రులను నిపుణులుగా మార్చడానికి ఎక్కువ సమయం వృధా చేయకుండా, 'ఎంప్లాయబిలిటీ' (ఉపాధి నైపుణ్యం)ను ఒక నేషనల్ మిషన్‌గా తీసుకోవాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ప్రకృతి సేద్యం ద్వారా ఎరువుల దిగుమతిని తగ్గించి స్వయం సమృద్ధి సాధించవచ్చని ఆయన చెప్పారు. ఏపీలో ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ఇది భూసారాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ట్రేసబిలిటీని సాధిస్తుందని తెలిపారు. "ప్రతి సవాలు ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. భారత్ ఇక అన్ స్టాపబుల్ గ్లోబల్ జెయింట్‌గా మారుతుంది. ఏపీ ప్రొజ్యూమర్ విధానంతో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం" అని చంద్రబాబు పేర్కొన్నారు.






