భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలి.. ప్రతి నీటిబొట్టు బంగారుకణం : CM CBN

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-06 09:15:03  IST  )

ప్రతీ నీటి బొట్టు చాలా విలువైనదని, భూమినే మనం ఒక జలాశయంలా మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలి.. ప్రతి నీటిబొట్టు బంగారుకణం : CM CBN
X

దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ప్రాంతాన్ని పండ్ల తోటల హబ్‌గా మార్చడమే కాకుండా, సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం అనంతపురం జిల్లాలో నిర్వహించిన ‘సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపు, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

నీటి బొట్టు - బంగారు కణం

ప్రతి నీటి బొట్టు విలువను అందరూ గుర్తించాలని, భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. గతంలో తాము ప్రవేశపెట్టిన ఇంకుడు గుంతలు, పంటకుంటలు, ‘నీరు-మీరు’, ‘నీరు-ప్రగతి’ వంటి పథకాలు భూగర్భ జలాల పెంపునకు ఎంతో దోహదపడ్డాయని గుర్తుచేశారు. రాయలసీమలో ఇప్పటికే 20 వేల చెరువులను నింపామని, అనంతపురంలో భూగర్భ జల మట్టాన్ని 11.25 మీటర్లకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.

మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే నెంబర్ వన్

రాయలసీమ రైతాంగానికి మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నామని సీఎం తెలిపారు. "మైక్రో ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాయలసీమలో 63 శాతం పంటలకు ఈ విధానాన్ని వర్తింపజేశాం. దీనివల్ల ఈ ప్రాంతం హార్టీకల్చర్ హబ్‌గా మారింది. రాబోయే ఆరేళ్లలో హార్టీకల్చర్ అభివృద్ధి కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తాం" అని ఆయన ప్రకటించారు.

పోలవరం విజన్ 2027

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. గత 21 నెలల్లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేశామని, 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, గంగ నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని: అమరావతి

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, అది అమరావతి మాత్రమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. దేశంలోని 50 రాజకీయ పార్టీలలో 49 పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని, కేవలం ఒక్క పార్టీ (వైఎస్సార్సీపీ) మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేస్తూ పిచ్చిమాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

పాలనలో పారదర్శకత - సుపరిపాలన

తాము ప్రజలకు సేవకులం మాత్రమే తప్ప పెత్తందార్లం కాదని సీఎం అన్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతను పెంచామని, గత ప్రభుత్వ హయాంలో అపవిత్రమైన వ్యవస్థను ప్రక్షాళన చేశామని తెలిపారు. ఆర్టీజీఎస్ (RTGS), 'మనమిత్ర' వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అవినీతి లేని సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2047 నాటికి తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ఆయన ఆకాంక్షించారు.

సహకార సమాఖ్య విధానానికి ఉత్తమ ఉదాహరణ BJP : సీఎం చంద్రబాబు

Next Story