- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లు నాశనం చేస్తే.. మేము శాసనం చేశాం : Nara Chandra Babu Naidu
అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క జగన్ అండ్ పార్టీ తప్ప దేశమంతా అమరావతికి మద్దతిచ్చిందన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం దక్కడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి బిల్లు ఆమోదం ప్రజా విజయమని, ప్రజా రాజధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాకు, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కు ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు అభినందనలు తెలిపారు. ఈ బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయన్నారు. దేశంలో అన్ని పార్టీలది ఒకదారైతే.. వైసీపీది మరోదారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకుని ద్రోహం చేశారని విమర్శించారు.
వారి హయాంలో నాశనం.. మా హయాంలో శాసనం
రాష్ట్రం నాశమైపోయినా ఫర్వాలేదని వైసీపీ మొండిపట్టుదలతో ముందుకెళ్లిందని, ఆ పట్టుదలకు జనం ఓటుతో సమాధానం చెప్పారని గుర్తుచేశారు. అమరావతిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే.. మేము అమరావతినే రాజధానిగా చేసి శాసనం చేశామన్నారు. రాజధాని ఉంటేనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందని సంకల్పించి, రాష్ట్రం మధ్యలో రాజధానిని ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అలాగని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమన్నారు. తిరుపతి, విశాఖ ప్రాంతాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. విభజన సమయంలో రాజధాని లేక పరిపాలన చేసేందుకు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందని, నాడు ఒక ప్రభుత్వ అధికారి కార్యాలయమే తన పాలనా కార్యాలయం అయిందని గుర్తుచేసుకున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైనా వైసీపీకి బుద్ధిరావడం లేదని, ఇప్పుడు కూడా రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లేదంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడేవారికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థంకావట్లేదన్నారు. నాడు సైబరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నపుడు కూడా అక్కడేం ఉందని ఇలాగే విమర్శించారని, ఇప్పుడదే సైబరాబాద్ హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా మారిందన్నారు. మనవాళ్లే మనకు ఉనికి లేకుండా చేయాలని చూడటం చాలా దారుణమన్నారు. బెదిరించి రాష్ట్రాలకు పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎవరూ సింగపూర్ పై అవినీతి ఆరోపణలు చేయలేదని, అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్లపై ఆరోపణలు చేసి రాష్ట్రం నుంచి తరిమేసిందని దుయ్యబట్టారు.
తెలంగాణకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదు..
తెలుగు రాష్ట్రాలు విడిపోయినంతమాత్రాన తెలంగాణకు తానెప్పుడూ వ్యతిరేకం కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమైఖ్యాంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఆ అనుభవంతోనే పోలవరంలో 9 మండలాలను విలీనం చేయించానన్నారు. ఆ మండలాలను విలీనం చేయకపోతే ప్రమాణం చేయనని చెప్పానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసమే హైదరాబాద్ ను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని పోగొట్టుకునే పనిని ఎన్నడూ చేయనని చంద్రబాబు తెలిపారు.






