రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం ఎమర్జెన్సీ మీటింగ్: అధికారులకు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-23 07:37:27  IST  )

రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం ఎమర్జెన్సీ మీటింగ్: అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి కల్తీపాల వ్యవహారం, ప్రజలకు అస్వస్థత మరణాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. కల్తీపాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులతో మాట్లాడి.. అనారోగ్యం బారిన పడిన, మరణించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే రాజమండ్రి వెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరణించినవారి పోస్టుమార్టం రిపోర్టుల్లో, చికిత్స పొందుతున్నవారి బ్లడ్ టెస్టు రిపోర్టుల్లో అనారోగ్యానికి కల్తీపాలే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పాలు విక్రయించిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలు, వయసుపైబడిన వారిపై కనిపిస్తోందని సీఎంకు వివరించారు. రాజమండ్రి చుట్టుపక్కల విక్రయదారులు 106 ఇళ్లకు పాలను పంపిణీ చేస్తున్నారని వివరించారు.

శివరాత్రి నుంచి ఆస్పత్రిపాలు

రాజమండ్రిలో కిడ్నీ సమస్యలతో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ఆస్పత్రిలో చేరడం.. ఒకరి తర్వాత ఒకరు.. ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఫిబ్రవరి 15 నుంచి 14 మంది ఆస్పత్రుల్లో చేరగా.. వారిలో ఎక్కువమంది 60 ఏళ్ల పైబడినవారు, 5నెలల శిశువు, మూడేళ్ల బాలుడు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురవ్వడంతో ఆదివారం అధికారులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రిలో చేరినవారందరికీ ఒకే వ్యక్తి పాలు సరఫరా చేస్తుండటంతో.. అనారోగ్యానికి కల్తీపాలు కారణమై ఉంటాయన్న అనుమానం రేకెత్తింది. శివరాత్రి రోజున పాలు, పెరుగు చేదుగా అనిపించాయని చెప్పడంతో పోలీసులు పాలవ్యాపారి గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల బ్లాడ్, యూరిన్ శాంపిల్స్ ను టాక్సికాలజీ పరీక్షలకు పంపగా.. రిపోర్ట్స్ రావలసి ఉంది.

రాజమండ్రి కల్తీపాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Next Story