సిటీలో నకిలీ చాక్లెట్ల గుట్టురట్టు.. గడువు ముగిసిన కెమికల్స్‌తో తయారీ

by Kema Shiva Kumar |

హైదరాబాద్ సీతారాంబాగ్‌లో నకిలీ చాక్లెట్ల కేంద్రంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు.

సిటీలో నకిలీ చాక్లెట్ల గుట్టురట్టు.. గడువు ముగిసిన కెమికల్స్‌తో తయారీ
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలు లొట్టలేసుకుంటూ తినే చాక్లెట్ల తయారీలో జరుగుతున్న పెద్ద మోసాన్ని హెచ్ ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. నగరంలోని సీతారాంబాగ్‌ పరిధిలో నకిలీ, గడువు ముగిసిన (Expired) రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న ఓ భారీ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సీతారాంబాగ్‌లోని ఓ గుట్టుచప్పుడు కాని ప్రదేశంలో ఎలాంటి బ్రాండ్ వివరాలు, ప్యాకేజింగ్ నిబంధనలు పాటించకుండా ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నారు. ప్రసిద్ధ బ్రాండ్లను పోలినట్లుగా ప్యాక్ చేస్తూ, వీటికి పాత లైసెన్స్ నంబర్లను వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్న ఈ కేంద్రంపై దాడి చేసి భారీ మొత్తంలో నిల్వ ఉంచిన నకిలీ చాక్లెట్లను, వాటి తయారీకి ఉపయోగించే యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హబీబ్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు..

ఈ నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రం నిర్వాహకుడు కొండ కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కిరాణా షాపులు, బేకరీల్లో చాక్లెట్లు కొనేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.

Next Story