- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టౌన్ ప్లానింగ్‌పై సీఎంసీ ఫోకస్.. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు కమిషనర్ సృజన ఆదేశాలు
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువుల్లో పరిష్కరించాలని, ప్రాధాన్యతా పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎంసీ కమిషనర్ జి.సృజన సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువుల్లో పరిష్కరించాలని, ప్రాధాన్యతా పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎంసీ కమిషనర్ జి.సృజన సూచించారు. శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ తక్షణ పరిష్కారం అవసరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ), సిటీ ప్లానర్లు (సీపీలు), డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో గురువారం సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న వివిధ పట్టణాభివృద్ధి, పౌరసేవల కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. సమావేశంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్‌నౌ (BuildNow) ద్వారా అందుతున్న భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) దరఖాస్తులు, పెండింగ్ కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, అలాగే రహదారుల విస్తరణకు సంబంధించిన భూసేకరణ అంశాల పురోగతిపై కమిషనర్ చర్చించారు.
మాన్సూన్ సన్నద్ధత చర్యలపై ప్రత్యేక దృష్టి
రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మాన్సూన్ సన్నద్ధత చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, సెల్లార్ తవ్వకాలు, అనధికారిక హోర్డింగ్‌లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల విస్తరణ, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ, సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అడ్డంకులను అధిగమించి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు. సమర్థవంతమైన పట్టణ పాలనకు సమగ్ర ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమని కమిషనర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పాలన ద్వారా మెరుగైన పౌర సేవలు అందించడం, పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సైబరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడం పట్ల కార్పొరేషన్ కట్టుబడి ఉందని తెలిపారు.






