- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ అగ్ని ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనం కాగా.. పదుల సంఖ్యలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర దుర్ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది, స్థానికులు, హెల్త్‌కేర్ వర్కర్లు తాము కళ్లారా చూసిన అత్యంత హృదయవిదారక దృశ్యాలను మీడియాతో పంచుకున్నారు.
ఒకరినొకరు అదిమి పట్టుకొని మృత్యు ఒడిలోకి..
సహాయక చర్యల్లో పాల్గొన్న మహమ్మద్ షోయబ్ అనే స్థానికుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలు, పొగ వ్యాపించడంతో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఒక జంట ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి వాష్‌రూమ్‌లోకి వెళ్లి లోపలి నుండి గడియ పెట్టుకున్నారు. సహాయక సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా.. అక్కడ ఒక జంట ఒకరినొకరు గట్టిగా అదిమి పట్టుకుని మరణించి ఉన్నారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక వారి శరీరాలు పూర్తిగా నల్లగా మారిపోయాయి. వారిలో ఏమైనా ప్రాణం ఉందేమోనన్న ఆశతో బయటకు తెచ్చి సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాగే మరో గదిలో ఇంకొక జంట బెడ్ చివర కూర్చున్న స్థితిలోనే మంటల్లో కాలి బూడిదయ్యారు.
వీల్‌చైర్‌లోనే సజీవదహనం – బేస్‌మెంట్‌లో మృతదేహాల గుట్ట
హెల్త్‌కేర్ వర్కర్ అష్రఫ్ ఖాన్ హోటల్ లోపలి భీతావహ పరిస్థితులను వివరిస్తూ.. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లలో ప్రమాద తీవ్రత అత్యధికంగా ఉందని తెలిపారు. బేస్‌మెంట్‌లోకి వెళ్లగానే అక్కడ ఒకేచోట ఎనిమిది మృతదేహాలు పడి ఉన్నాయి. హోటల్ రిసెప్షన్ వద్ద దాదాపు 25 ఏళ్ల వయసున్న ఒక యువతి శరీరం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. మరింత దారుణంగా.. ఒక వికలాంగ వృద్ధుడు తాను కూర్చున్న వీల్‌చైర్‌తో సహా అక్కడికక్కడే కాలిపోయి శవమయ్యాడు. ఆ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ముగ్గురు విదేశీయులు స్పృహ తప్పి పడి ఉండటంతో, వారికి అత్యవసరంగా సీపీఆర్ అందించి కాపాడే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకుండా నడుపుతున్న ఇలాంటి హోటళ్ల నిర్లక్ష్యం కారణంగా.. అమాయక ప్రజలు చివరి క్షణంలో ప్రాణాల కోసం ఎంతలా తల్లడిల్లారో చెప్పడానికి ఈ ఘటనా స్థలంలో కనిపించిన ఆనవాళ్లే సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.






