- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడుబడిన ఇంట్లో నక్కిన పులి.. గాండ్రింపులకు హడలిపోతున్న ప్రజలు
రాయవరం మండలం కూర్మాపురంలో ఓ పాడుబడిన ఇంటి వద్ద ఉన్న పొదల్లో పులి ఉన్నట్లు స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులుగా పెద్దపులి అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. థర్మల్ డ్రోన్ కెమెరాలకు కూడా పులి జాడ దొరక్కపోవడంతో.. గాలింపు మరింత ముమ్మరం చేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి జిల్లాలోని రాయవరం మండలం కూర్మాపురంలో ఓ పాడుబడిన ఇంటి వద్ద ఉన్న పొదల్లో పులి ఉన్నట్లు స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ ఇంటి నుంచి వస్తోన్న పులి గాండ్రింపులకు చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు హడలిపోతున్నారు. స్థానికుల సమాచారంతో కేశవరం కొండల ప్రాంతం నుంచి.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పూణే రెస్క్యూ టీమ్, పోలీసులు.. పులి పాదముద్రల్ని గుర్తించారు. ప్రస్తుతం పులి ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి టెర్రస్ పైకి చేరుకున్న అధికార యంత్రాంగం.. పులిని పట్టుకునేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తున్నారు.
రెస్ట్ తీసుకుంటున్న పెద్దపులి
ప్రస్తుతం పులి ఆ ఇంటి పొదల్లో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వైల్డ్ లైఫ్ నుంచి వచ్చిన డాక్టర్ గన్ ద్వారా పులికి మత్తు ఇవ్వాల్సి ఉంటుందని, స్థానికులు ఆ ఇంటి దరిదాపుల్లో ఎక్కడా ఉండొద్దని పోలీసులు హెచ్చరించారు. తొలుత పులి పాదముద్రలు చూసి కుక్కవా పులివా అన్న అనుమానం కలిగిందని, వాటిని పూర్తిగా పరిశీలించాక పెద్దపులివేనని అధికారులు నిర్థారించారని స్థానికులు తెలిపారు. ఉదయం పొలంలో మందుకొట్టేందుకు వెళ్లిన రైతులు పులిని చూసి హడలిపోయారు.
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చిన పెద్దపులి ఛత్తీస్ గఢ్ అభయారణ్యం మీదుగా తెలంగాణలోని పాల్వంచ దాటి.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, పట్టిసీమ.. తూర్పుగోదావరి జిల్లా కొండేపూడి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ హడలెత్తించింది. పశువులపై పెద్దఎత్తున దాడిచేసి చంపేసింది. నిన్న ఒక ఆవుని, మూడు దూడల్ని పులి తీవ్రంగా గాయపరిచింది. కాసేపట్లో పెద్దపులిని అధికారులు బంధించనుండగా.. పులిని చూసేందుకు స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడారు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి సైతం ప్రజలు వస్తుండటంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం తలనొప్పిగా మారింది.






