జగదాంబ సెంటర్‌లో యువతిపై దాడి: నిందితుడి అరెస్ట్

by Ramesh Naini |   (  Updated:2026-01-11 12:48:31  IST  )

విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

జగదాంబ సెంటర్‌లో యువతిపై దాడి: నిందితుడి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో స్వామి మాల ధరించిన ఓ వ్యక్తి తన చెంపపై కొట్టి, బూతులు తిట్టుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి, జరిగిన విషయాలను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది. దీనితో వెంటనే స్పందించిన విశాఖ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని గుర్తించారు. ఎంఆర్‌పేట పోలీసులు దర్యాప్తు చేపట్టి యువతిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు యువతి సమక్షంలో పోలీసులు నిందితుడితో క్షమాపణలు చెప్పించారు.

కాగా, బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె జగదాంబ జంక్షన్ నుంచి ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా థియేటర్ సమీపంలో ఉన్న ‘రాజాసాబ్’ సినిమా పోస్టర్‌ను ఫోటో తీసింది. తాను ప్రభాస్ అభిమానినని, అందుకే పోస్టర్‌ను చిత్రీకరించానని తెలిపింది. ఈ క్రమంలో స్వామి మాల ధరించినట్లు కనిపించిన ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాడని చెప్పింది. మొదట అతను సమీపంలోని ఆటో డ్రైవర్లపై అరుస్తున్నాడని భావించి పట్టించుకోలేదని పేర్కొంది. అయితే కొద్దిసేపటికి అదే వ్యక్తి వచ్చి తన చెంపపై కొట్టాడని, నోటికొచ్చిన బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు వాపోయింది. దాడిలో తన కళ్లద్దాలు విరిగిపోయాయని తెలిపింది.

అసలు తనను ఎందుకు కొట్టాడో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. దాడి సమయంలో అక్కడున్న వారు ఎవరూ స్పందించలేదని, ఇది తనను మరింత బాధించిందని ఆమె కన్నీటితో చెప్పింది. అనంతరం ఆఫీస్ సహచరులకు ఫోన్ చేయగా వారు వచ్చి తనను తీసుకెళ్లారని తెలిపింది. తరువాత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

READ MORE ....

విశాఖలో యువతిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. పోలీసులపై సీఎం ప్రశంసలు

Next Story