ఏపీ రాజకీయాల్లో నూతన శకం.. నారా లోకేశ్ నాయకత్వం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-23 05:42:49  IST  )

ఏపీ రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సాంకేతిక రంగంలోనే కాదు ప్రజా సంక్షేమంలోనూ కూటమి సర్కార్ సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది.

ఏపీ రాజకీయాల్లో నూతన శకం.. నారా లోకేశ్ నాయకత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సాంకేతిక రంగంలోనే కాదు ప్రజా సంక్షేమంలోనూ కూటమి సర్కార్ సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది. ఏ రంగమైనా తాను ముందుండి నడిపించగల సమర్థుడిని నాయకుడిగా ఏపీ ప్రజానీకం ఎన్నుకుంది. ఆ నాయకుడి వారసుడిగా.. తండ్రికి తగిన తనయుడిగా నిరూపించుకుంటున్నారు ఏపీ కేబినెట్ మంత్రి నారా లోకేశ్.

రాజకీయ యవనికపై నూతన శకాన్ని ఆవిష్కరిస్తూ.. సాంకేతికతను పరిపాలనకు జోడిస్తూ ప్రజా సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మంత్రి నారా లోకేశ్. తండ్రి మార్గదర్శనంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన తన ప్రతిభ, నైపుణ్యం, ప్రజల పట్ల తనకున్న సేవా భావం ద్వారా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. తండ్రి నాయకత్వంలోని ఏపీ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలను చేపట్టారు. మొదటి పర్యాయం 2017-2019 వరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన ముందు చూపును నిరూపించుకున్నారు. 12 జూన్ 2024 నుంచి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిగా కేవలం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వేదికలపై తన సత్తాను చాటుతూ ఏపీ బ్రాండ్ ను బలపరుస్తున్నారు మంత్రి నారా లోకేశ్.

కేవలం సీఎం చంద్రబాబు నాయుడు వారసుడిగానే కాదు.. విజన్ ఉన్న పాలకుడిగా, అంకిభావం కలిగిన ప్రజాసేవకుడిగా, పరిపాలనపై పట్టున్న పాలకుడిగా అనేక విజయాలను సాధిస్తున్నారు. ఏపీ అభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.

ఓటమి నుంచి గెలుపు వరకు

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఓటమిని చవి చూసింది. టీడీపీ పార్టీ ప్రజాతీర్పును గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలిచింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ముందుకు సాగింది. అయితే నాటి వైసీపీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరిపోయాయి. గత ప్రభుత్వంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలను వేధింపులకు గురి చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కక్ష కట్టారు. ఏకంగా చంద్రబాబు నాయుడును, ఆయన సతీమణిని టార్గెట్ చేశారు. ఆయన్ను జైలు పాటు చేసి ఎంతో వేధించారు. అదంతా చూస్తున్న మంత్రి నారా లోకేశ్ ఒక్కసారిగా దూకుడును పెంచారు. తండ్రికి అండగా నిలవడమే కాకుండా పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. 2019 తరువాత యువగళం పాదయాత్ర నిర్వహించిన ఏపీ అంతటా తిరికి ప్రజలకు మరింత చేరువయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, తీరును ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, దేశ భద్రతకు పెద్దపీట వేసే పార్టీలతో టీడీపీ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ బంపర్ మెజారిటీతో గెలవడానికి అనితరసాధ్యమైన కృషి చేశారు.

చారిత్రక మైలురాయి

2019 ఎన్నికల అనంతరం మంత్రి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర ద్వారా ఆయన సామాన్యుల కష్టాలను కళ్లారా చూశారు. గడపగడపకూ వెళ్లి నిరుద్యోగులు, రైతులు, మహిళల సమస్యలను తెలుసుకుని వారికి తాను ఉన్నాననే భరోసానిచ్చారు. ఈ యాత్రే 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి బలమైన పునాది వేసిందని కూటమి నేతలే కాదు ప్రజలు కూడా గొంతెత్తి చాటుతారనడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో 91,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించి, తనపై ఉన్న విమర్శలకు మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పారు మంత్రి నారా లోకేశ్.

సాంకేతిక విప్లవం: ఐటీ హబ్‌గా ఏపీ

గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖపట్నంను ఐటీ డెస్టినేషన్‌గా మార్చడంలో లోకేష్ సఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో ఏపీ మళ్లీ పెట్టుబడుల స్వర్గధామంగా మారుతోందనడం అతిశయోక్తి కాదు. సీఐఐ సదస్సును విజయవంతం చేయడంలోనూ, తాజాగా దావోస్ లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చలు జరిపి ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలను సాధించడంలోనూ మంత్రి లోకేశ్ పోషిస్తున్న పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. అమరావతిని క్వాంటమ్ క్యాపిటల్ గా మార్చేందుకు ఎనలేని కృషి చేస్తున్నారు. గూగుల్, మెటా, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ సంస్థలు ఏపీలో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నాయంటే అందుకు కారణం మంత్రి నారా లోకేశ్ పరిచయం చేసిన స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ నినాదమే అని చెప్పుకోవాలి. అంతేకాకుండా అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ఏఐ యూనివర్సిటీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్ఎంజీ గ్రూప్ వంటి సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయంటే అది ఆ సంస్థకు మంత్రి నారా లోకేశ్ కల్పించిన నమ్మకం. కేవలం పెట్టుబడులను రప్పించడమే కాదు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారు.

పంచాయితీరాజ్ మంత్రిగా విజయాలు

2017 నుంచి 2019 సంవత్సరం నారా లోకేశ్ ఏపీ పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేశారు. తన పదవి బాధ్యతలకు వన్నె తెచ్చేలా ఆయన ఎన్నో విజయాలను సాధించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలోని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. 23వేల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసి చూపించారు. అంతటితో ఆగకుండా పల్లెల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ కు ఆద్యులు

ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ కు మంత్రి నారా లోకేశ్ బీజం వేశారు. మొన్నటికి మొన్న మొంథా తుఫాను సమయంలో వీలైనంత తక్కువ నష్టం కలిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగిందంటే దానికి కారణంగా రియల్ టైమ్ గవర్నె్న్స్ అనే చెప్పుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేశారు నారా లోకేశ్. అంతేకాకుండా నష్ట నివారణ చర్యలు, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అంతేకాకుండా పాలనను డిజిటలైజ్ చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గిస్తున్నారు. అందుకోసం వాట్సాప్ గవర్నెన్స్ ను మన మిత్ర పేరిట డెవలప్ చేశారు. దాని ద్వారా 160కి పైగా ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లకు జియో ట్యాగింగ్, డ్రోన్ల ద్వారా భూముల సర్వే వంటి వినూత్న ప్రయోగాలు నారా లోకేశ్ పాలనా దక్షతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యా రంగంలో సంస్కరణలు

చదవడం అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది నేర్చుకోవడం కాదు.. భవిష్యత్తును నిర్మించగలిగే విధంగా విద్యను అభ్యసించడం అని విశ్వసిస్తారు మంత్రి నారా లోకేశ్. అందుకే కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా యువత పరిశ్రమలకు తగిన నైపుణ్యం నేర్చుకొని ఉపాధి పొందాలని ఆకాంక్షించారు. అనుకున్నట్లుగానే స్కిల్ డెవలప్మెంట్ కు పెద్దపీట వేస్తున్నారు. కేవలం ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలకే పరిమితం కాకుండా విద్యార్థులు భవిష్యత్తులో రాజకీయాల్లోనూ రాణించేలా మాక్ అసెంబ్లీని నిర్వహించి చరిత్ర సృష్టించారు. డిజిటల్ విద్యా విధానాన్ని పాఠశాల స్థాయి నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో డీఎస్సీ ద్వారా వేలాది టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా నిరుద్యోగుల కలను సాకారం చేయడమే కాకుండా, విద్యా వ్యవస్థనూ బలోపేతం చేశారు. తల్లిదండ్రులను కూడా విద్యా వ్యవస్థలో భాగం చేస్తూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లను నిర్వహించి దేశానికే ఏపీని ఆదర్శంగా నిలుపుతున్నారు.

ప్రజా దర్బార్ తో అభయం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించి.. ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రజా దర్బార్ ను పరిచయం చేశారు. కేవలం తాను మాత్రమే కాకుండా ప్రతి శాసనసభ్యుడు, లోక్ సభ సభ్యుడు ప్రజా దర్బార్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా ప్రతిరోజూ వేలాది మంది బాధితులు ప్రజాప్రతినిధులను నేరుగా కలిసి వారి వినతులను ఇచ్చే ఆస్కారం కల్పించారు. తాను కూడా వినతులను పరిశీలించడమే కాకుండా అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నారు.

ప్రతిష్టాత్మక అవార్డులు

నారా లోకేశ్ పనితీరుకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. వాటిల్లో మచ్చుకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఒకటి. గవర్నెన్స్ లో అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు గానూ ఈ అవార్డును లోకేశ్ 2018లో అందుకున్నారు. అదే ఏడాది బిజినెస్ వరల్డ్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా మంత్రి నారా లోకేశ్ ను వరించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు చెందిన నెట్వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు మంత్రి నారా లోకేశ్ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

జెడ్-జెడ్ నాయకుడిగా

వినే ఓర్పు.. సమస్యను తీర్చే నేర్పు ఉన్న నాయకుడిగా నారా లోకేశ్ కు యువతలో క్రేజ్ ఉంది. విద్యార్థుల వికాసానికి, నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన చేస్తున్న కృషిని అనునిత్యం అభినందిస్తోందని ఏపీ యువత. అందుకే దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా తమ నాయకుడిగా ఆయన్ను చూస్తున్నారు. జెడ్-జెడ్ నాయకుడయ్యే అన్ని డైనమిక్ లక్షణాలు ఆయనలో ఉన్నాయని అంటున్నారు. అందుకే తమ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా నారా లోకేశ్ ను ముందు వరుసలో ఉంచుతున్నారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా

సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్య సాధనే ధ్యేయంగా మంత్రి నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా లోకేశ్ పని చేస్తున్నారు. తండ్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడి అనుభవం, మంత్రిగా ఉన్న లోకేశ్ ఆధునిక ఆలోచనలు తోడైతే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సుసాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. మంగళగిరి మట్టి నుంచి దావోస్ వేదికల వరకు లోకేశ్ ప్రస్థానం కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల కాదు, అది ఒక రాష్ట్రం మళ్లీ పుంజుకుంటున్న తీరుకు ప్రతిరూపం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More..

నా బలం.. నా ప్రశాంతత నీవే : నారా బ్రాహ్మణి

Next Story