కాసులు కురిపిస్తున్న ‘ఆర్ఎస్ఆర్’.. విస్తీర్ణం తేడాలతో కొర్రీలు

by  |
కాసులు కురిపిస్తున్న ‘ఆర్ఎస్ఆర్’.. విస్తీర్ణం తేడాలతో కొర్రీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొందరికి సేత్వార్/ఆర్ఎస్ఆర్ కాసులు కురిపిస్తోంది. ఆ రికార్డులు వివాదాలు సృష్టిస్తున్నాయి. అవే సమస్యలనూ పరిష్కరిస్తున్నాయి. ఈ కిటుకు భలే గమ్మత్తుగా తయారైంది. ఆర్ఎస్ఆర్ రికార్డులు, ప్రస్తుత పట్టాదారు పాసు పుస్తకాల్లోని మొత్తం విస్తీర్ణానికి మధ్య అగాధమే నెలకొంది. ప్రతి గ్రామంలో 15 నుంచి 20 శాతం వరకు సర్వే నంబర్లలో తేడాలు స్పష్టంగా ఉన్నాయి. పాసు పుస్తకాల్లో ఉంటే రికార్డుల్లో ఉండవు. రికార్డుల్లో ఉంటే పాసు పుస్తకాల్లో ఉండవు. ఆ మొత్తం సర్వే నంబర్ల(సబ్డివిజన్ల)లోని విస్తీర్ణాన్ని సరిపోలిస్తే ఆర్ఎస్ఆర్ కంటే పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువ లేదా తక్కువగా రికార్డు అయ్యింది. చాలా మటుకు పాసు పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది. ఈ కారణం చూపి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొందరికి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయలేదు. ప్రధానంగా అసైన్డ్భూముల రైతులకు మొండిచేయి చూపారు.

అలాగే ధరణి పోర్టల్‌ను అమలు చేసిన తొలిరోజుల్లో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణానికి తేడా ఉంటే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడేమో కొందరికి ఆ ఆర్ఎస్ఆర్ వ్యత్యాసం కాసుల వర్షం కురిపిస్తోంది. స్లాట్బుక్ ఐతే చాలు.. ఏ ప్రాపర్టీనైనా రిజిస్ట్రేషన్ చేయొచ్చునని గ్రేట్ధరణి పోర్టల్అధికారులకు చెబుతోంది. ఇక ఏ కారణం, కుంటిసాకు చెప్పేందుకు వీల్లేదు. కానీ ఈ అంశంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ కొందరు తహశీల్దార్లు ఒక్క గుంట వ్యత్యాసం ఉందని లెక్క తేలినా క్రయ విక్రయాలకు అంగీకరించడం లేదు. కలెక్టరుకు లేఖ రాసేశాం. అక్కడి నుంచి ఆదేశాలు వస్తేనే రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ చేస్తాం అంటూ తిప్పించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు అది తేలేది కాదని వారికీ తెలుసు. కానీ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్బుక్ చేసుకుంటే తప్పనిసరి చేయాలి. కానీ డేటాలోని పొరపాట్లను ఎత్తిచూపిస్తూ కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు. ఐతే ఇది అందరి పట్ల కాదు. వారికి నచ్చకపోతే ఆర్ఎస్ఆర్ వ్యత్యాసం తేడా అంటూ రిమార్కు చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో తహశీల్దార్లు చెల్తా.. అనేస్తున్నారు. ఆర్ఎస్ఆర్ విస్తీర్ణంలో వ్యత్యాసంపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి విధివిధానాలు అందలేదు. అసలేం చేయాలో తెలియదు. నిజానికి సమగ్ర భూ సర్వే నిర్వహిస్తే తప్ప ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు పరిష్కారం మార్గం లేదు.

అంతా వారిష్టం

ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం తేడాలు కలిగిన సర్వే నంబర్లలోని భూముల క్రయ విక్రయాలపై అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్వోఆర్ 2020 చట్టంలో దానికి ఎలాంటి పరిష్కారాన్ని చూపించలేదు. పార్టు బి కింద నమోదు చేసి రైతాంగాన్ని అగాధంలోకి నెట్టేశారు. ఇప్పుడా భూముల క్రయ విక్రయాలపై సందిగ్ధత నెలకొంది. పాత సేల్ డీడ్స్ మ్యుటేషన్లకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆర్ఎస్ఆర్ తేడాలు ఉన్నాయంటూ పెండింగులో పెడుతున్నారు. ఐతే ధరణి వెబ్సైట్లో మాత్రం సర్వే నంబరులోని విస్తీర్ణానికి, పట్టాదారుల పేరిట విస్తీర్ణానికి ఎక్కువ, తక్కువగా ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. వెంటనే మ్యుటేషన్ చేస్తున్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకున్నా అధికారులకు ఇష్టమైతేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూ విస్తీర్ణంలో తేడాలు కొందరికి కాసుల వర్షం కురిపిస్తుందని సమాచారం.

అదనపు విస్తీర్ణానికి బలయ్యేదెవరు?

2017 లో భూ రికార్డుల ప్రక్షాళన మొదటి నాలుగు నెలల్లోనే 80 శాతానికి పైగా పూర్తయ్యింది. ఐతే అప్పుడేమో రికార్డులన్నీ త్వరగా డిజిటలైజేషన్ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. దాంతో యథాతథంగా రికార్డు చేశారు. తర్వాత ఖాస్రా పహాణి విస్తీర్ణాలకు సరిపోవాలన్న షరతులు విధించారు. అంతకు ముందు పూర్తయిన రికార్డుల ప్రక్షాళన దాని ప్రకారం జరగలేదు. పహాణీల ఆధారంగానే రికార్డులను పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో 15 నుంచి 20 శాతం సర్వే నంబర్ల పూర్తి విస్తీర్ణం, ఖాస్రా పహాణిలో నమోదైన విస్తీర్ణం కంటే అదనంగా నమోదైనట్లు అధికారులే చెబుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో పేర్కొన్న భూమి కంటే క్షేత్రంలో తక్కువగా ఉంటుంది. ఐతే క్షేత్రంలో తనకు ఉన్న భూమిని పూర్తిగా అమ్మేసినా లేని భూములకు మళ్లీ హక్కుదారుడిగా రికార్డుల్లో కొనసాగే అవకాశం ఉంది. తన భూమిని చూపించాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. పైగా అక్రమంగా సదరు భూములను ఎవరికైనా యథేచ్ఛగా విక్రయించే సాంకేతిక నైపుణ్యం ధరణి పోర్టల్ లో ఉంది. దాంతో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆర్ఎస్ఆర్ అంటే..?

సేత్వార్ ను సర్వే నంబరుకు బర్త్ సర్టిఫికేట్లాంటిదే. అన్ని రకాల భూములను సర్వే చేసి, సెటిల్మెంట్ చేసి, వర్గీకరించి, హక్కు, అనుభవాలను, శిస్తును నిర్ణయించి తయారు చేసిందే భూరికార్డులు. భూమి కొలతల తర్వాత ఆ భూమి ఎవరిది అని తెలిపేదే సెటిల్మెంట్. తెలంగాణ ప్రాంతంలో చివరి సారిగా 1940౼50 లో సెటిల్మెంట్ జరిగింది. ఇలా సెటిల్మెంట్ జరిగినపుడు తయారుచేసిన రికార్డులనే సెటిల్మెంట్ రికార్డులు అంటారు. ఈ సెటిల్మెంట్ రికార్డులనే తెలంగాణా ప్రాంతంలో సేత్వార్ అని పిలుస్తారు. ఆర్ఎస్ఆర్(రీసెటిల్మెంట్ఆఫ్ సర్వే రికార్డు)గానూ పిలుస్తారు. ఏ భూమికి ఏ చిక్కు వచ్చినా అధికారులకు / కోర్టులకు ఇదే ఆధారం. గ్రామ స్థాయిలో రూపొందించే 11 రిజిస్టర్లకి ఈ సేత్వార్ /ఆర్ఎస్ఆర్ ను మూలాధారంగా పరిగణిస్తారు. భూమి పుట్టుపూర్వోత్తరాలు తెలియాలంటే సేత్వార్ / ఆర్ఎస్ఆర్ నుంచి చూడాలి.

చర్యలు వివాదాస్పదం

– రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సర్వే నం.39 ప్రొహిబెటెడ్ప్రాపర్టీస్ లో ఉంది. కానీ క్రయ విక్రయాలకు తావిచ్చారు. ఇందులో ఒకరు రెండెకరాలు కొనుగోలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఖాతా నంబరు 60 వేలకు(ఐదెంకెలు) పైగా ఉంది. ఆర్ఎస్ఆర్ వ్యత్యాసం ఉందని స్పష్టం.

– కొన్ని సర్వే నంబర్లు కల్పితమని కూడా పేర్కొన్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సర్వే నం.39/4లో లాయక్అలీఖాన్పేరిట 5.32 ఎకరాలు ఉంది. ఐతే కల్పిత సర్వే నంబరు అని ల్యాండ్స్టేటస్లో పేర్కొని ట్రాన్సక్షన్చేయడానికి వీల్లేదంటూ నిషేదిత జాబితాలో నమోదు చేశారు. కానీ అప్పటికే పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారు. ఆధార్నమోదు చేశారు. ఈకేవీసీ పూర్తి చేశారు. మరి ఆ కల్పిత సర్వే నంబరుకు కారకులెవరో చర్యలకు మాత్రం ఉపక్రమించడం లేదు.

– రంగారెడ్డి జిల్లా కేశంపేట, షాద్నగర్, కొందుర్గు, చేవెళ్ల, శంకర్పల్లి, యాచారం, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఆర్ఎస్ఆర్ తో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఈ మండలాల్లో కొన్ని రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆపారు.

– యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో కొందరు తహశీల్దార్ల చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆర్ఆర్ఎస్వ్యత్యాసం ఒక్క గంట ఉందని ఉద్దేశ్యపూర్వకంగా మ్యుటేషన్లు నిలిపివేస్తున్నారు. ఆ ఒక్క గుంట దశాబ్దాలుగా వస్తుందని రికార్డులు సమర్పించినా ససేమిరా అంటున్నారు. కలెక్టరుకు లేఖ రాశాను. అక్కడి నుంచి ఏదైనా సమాధానం వస్తేనే మ్యుటేషన్ చేస్తానంటూ కొర్రీలు పెడుతున్నారు. ఆర్ఎస్ఆర్ వ్యత్యాసంపై కలెక్టరు నుంచి ఎలాంటి సమాధానం రాదని తెలుసు. కానీ దరఖాస్తుదారులు తమ మాట వినలేదనో, మరేఇతర కారణాల చేతనో అవసరం లేకపోయినా వివాదాలను సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విచారిస్తే నిజాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఆర్ తేడాలు ఉన్న సర్వే నంబర్లు ప్రతి ఊరిలోనూ 15 నుంచి 20 శాతం వరకు ఉన్నాయని అధికారుల అంచనా. కానీ ఆయా సర్వే నంబర్లలోని భూముల క్రయ విక్రయాలు జరిగాయి. ధరణి పోర్టల్ద్వారా జరిగిన వ్యవసాయ ఆస్తుల క్రయ విక్రయాల్లో ఎన్ని సర్వే నంబర్లలోని విస్తీర్ణం కరెక్టుగా ఉందో రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు 7,24,014 దరఖాస్తులు రాగా 6,89,752 క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జరిగాయి. ఏయే భూముల అమ్మకాలు జరిగాయో, ఆ సర్వే నంబర్ల ఆర్ఎస్ఆర్, పట్టాదారుల పేరిట ఉన్న భూమిని లెక్కిస్తే నిజాలు తెలుస్తాయి.


Next Story