ప్రైవేటు పాఠశాలల పుస్తకాల దందా

by Batti.Sumithra |

వేసవి సెలవులు ముగిసి కొత్తవిద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతారు.

ప్రైవేటు పాఠశాలల పుస్తకాల దందా
X

దిశ, చౌటుప్పల్ : వేసవి సెలవులు ముగిసి కొత్తవిద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతారు. అయితే ప్రస్తుతం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమంటే విద్యార్థుల కంటే ముందుగా తల్లిదండ్రులే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల వ్యవహారం అలాంటి పరిస్థితిని సృష్టిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో సుమారు 30కి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాల ఒక్కో విధంగా వ్యాపారం నిర్వహిస్తూ తల్లిదండ్రుల పై ఆర్థిక భారం మోపుతున్నాయి. కొన్ని పాఠశాలలు పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని యూనిఫార్మ్‌లు, షూలు, ఇతర విద్యాసామగ్రిని కూడా పాఠశాలల ద్వారానే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో పుస్తకాలు, నోట్‌బుక్స్ విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా విస్మరిస్తూ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మూడో తరగతి పుస్తకాలకే రూ.10 వేలకు పైగా..

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కేవలం మూడో తరగతి విద్యార్థులకే నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్‌ల కోసం రూ.10 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. పై తరగతులకు వెళ్లే కొద్దీ ఈ మొత్తం మరింత పెరుగుతోంది. అంతేకాకుండా కొత్త ప్రవేశాలకు రూ.10 వేల వరకు అడ్మిషన్ ఫీజు వసూలు చేయడంతో పాటు, ఒక్కో తరగతికి వార్షిక ఫీజుగా రూ.50 వేలకు పైగా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించిన ఫీజు వివరాలను పక్కనపెట్టి, యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా ఫీజులు నిర్ణయించి వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు..

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకుని శివప్రసాద్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు చౌటుప్పల్‌లో జరుగుతున్న పుస్తకాల దందా, ఫీజుల దోపిడీ పై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, ప్రైవేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపైనా విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీలకు కొర్రీలు..

గత కొన్ని సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పాఠశాలల యాజమాన్యాలు వాటిని అమలు చేయడం లేదని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. దీని పై ప్రశ్నిస్తే, అది తప్పనిసరి నిబంధన కాదని, విద్యాశాఖ అధికారులు కేవలం సూచనలు మాత్రమే చేశారని, అమలు చేయడం తమ ఇష్టమని యాజమాన్యాలు సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు అధికారికంగా లేఖలు జారీ చేసినప్పటికీ అవి అమలులోకి రాకపోవడం పట్ల పలువురు జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ రాయితీలు తప్పనిసరిగా అమలయ్యేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి.. సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకుని శివప్రసాద్

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే ఫీ రెగ్యులేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని డాక్టర్ చినుకుని శివప్రసాద్ డిమాండ్ చేశారు. సామాన్య కుటుంబాలకు కూడా ప్రైవేటు పాఠశాలల్లో విద్య అందుబాటులో ఉండేలా ఫీజుల నియంత్రణ అవసరమన్నారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా, ప్రైవేటు పాఠశాలల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే తల్లిదండ్రుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Next Story