సిద్దిపేటకు మరో వరం... త్వరలోనే సరికొత్త బీసీ స్టడీ సర్కిల్

by Vemula.Srinu Prasad |

వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీ యువతను సాధికారత కలిగిన వర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ..

సిద్దిపేటకు మరో వరం... త్వరలోనే సరికొత్త బీసీ స్టడీ సర్కిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీ యువతను సాధికారత కలిగిన వర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారులు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు, శాఖాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం 12 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా గైడ్‌లైన్స్ ఇస్తున్నామని, స్టడీ సర్కిల్ ఇయర్ బుక్ విడుదల చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ సొంత భవనాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్సెస్సీ, బ్యాంకింగ్, ఆర్ఆర్‌బీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

బీసీ హాస్టళ్ల రికార్డు..

2025-26 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 96.05 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సగటు ఉత్తీర్ణత (95.15 శాతం) కంటే ఎక్కువని అభినందించారు. పరీక్షలకు హాజరైన 4,941 మంది విద్యార్థుల్లో 4,746 మంది ఉత్తీర్ణులు కాగా.. 285 హాస్టళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 51.63 శాతం (సిరిసిల్ల, రంగారెడ్డి, హనుమకొండ టాప్), రెండో సంవత్సరంలో 71.85 శాతం (హనుమకొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు టాప్) ఉత్తీర్ణత నమోదైంది. తక్కువ ఫలితాలు సాధించిన అధికారులను మందలిస్తూ, ఈ ఏడాది ప్రత్యేక మెంటరింగ్, మోడల్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

వెల్కమ్ కిట్.. హెల్త్ ప్రొఫైల్..

ఈ విద్యా సంవత్సరం నుంచి హాస్టల్ విద్యార్థులకు యూనిఫాం, నోట్‌బుక్స్, బెడ్‌షీట్లు, ట్రంక్ బాక్స్, స్కూల్ బ్యాగ్, ట్రాక్‌సూట్, షూస్, సాక్స్, బ్లాంకెట్లు, స్టేషనరీతో కూడిన 'సమగ్ర వెల్కమ్ కిట్' అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ప్రతి విద్యార్థికి అకడమిక్, హెల్త్ ప్రొఫైల్ రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలి. హాస్టళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన పోషకాహారం ఇవ్వాలి. జూన్ నెలాఖరులోపు పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించాలి" అని మంత్రి ఆదేశించారు.

బోనాల పండుగ.. కుల వృత్తుల ప్రదర్శన..

బోనాల పండుగ నేపథ్యంలో జూలై 14 నుంచి 24 వరకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద కుల వృత్తుల ప్రదర్శన, మట్టి కుండల స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.

స్థానిక సంస్థల్లోని బీసీ ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. బీసీ, ఈబీసీ వర్గాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, తహసీల్దార్, ఆర్డీవో స్థాయిల్లో గ్రీన్ ఛానల్ ద్వారా లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కుట్టు మిషన్ల పథకంపై కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు, కమిషనర్ బాలమాయదేవి, అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Next Story