ఎలక్ట్రిక్ బస్సులపై భయాలు వద్దు.. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ అధికారుల కీలక చర్చలు

by Ramesh Naini |

త్వరలో టీజీఎస్ఆర్టీసీకి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో అధికారులు శనివారం చర్చలు జరిపారు.

ఎలక్ట్రిక్ బస్సులపై భయాలు వద్దు.. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ అధికారుల కీలక చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో టీజీఎస్ఆర్టీసీకి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో అధికారులు శనివారం చర్చలు జరిపారు. ఈవీల రాకతో తమ ఉద్యోగాలు పోతాయని కార్మికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్టీసీ ఈడీలు వెంకన్న, రాజశేఖర్, శ్రీధర్, ఖుష్రోషా ఖాన్, సాలమన్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. 2వేల ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని... వీటి కోసం అవసరమైన 20 కొత్త డిపోలు కూడా ఏర్పాటు కానున్నాయని వారు సంఘాలతో తెలిపారు. వీటి వల్ల కొత్త నియామకాలు కూడా ఉంటాయని... ఈవీల వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు. 2 వేల బస్సుల్లో వెయ్యి ఆర్టీసీ, మరో వెయ్యి ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహిస్తారని అధికారులు తెలిపినట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. వీటి కోసం 20 కొత్త బస్ డిపోలు వస్తాయని.. పది ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల, పదింటిని ఔటర్ లోపల ఏర్పాటు చేస్తారని అన్నారు.

మరోవైపు వెయ్యి మంది డ్రైవర్లకు త్వరలో నియామక పత్రాలు అందచేస్తారని.. త్వరలో 1500 మంది కండక్టర్ల నియామకాలు చేస్తారని అధికారులు తెలిపినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. అలాగే ఉద్యోగ సంఘాల చేసిన పలు డిమాండ్ల విషయంలోనూ ఈడీలు సానుకూలంగా స్పందించారు. ఎలక్ట్రిక్ బస్సులను అడ్డుకుంటామని చెప్తూ 2వేల కొత్త బస్సుల అవకాశాలను చేజార్చుకోవద్దని అధికారులు.. కార్మిక సంఘాల నేతలకు సూచించారు.

Next Story