- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయ పరిపాలనకు ఆధునిక బాట.. సిటా ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఐటీఏ) శిక్షణలో తెలంగాణ దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందన్న నమ్మకముందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఐటీఏ) శిక్షణలో తెలంగాణ దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందన్న నమ్మకముందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అర్చకులు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు. దైవాజ్ఞ లేనిదే ఏ కార్యం జరగదనీ, దేవాదాయ శాఖ మంత్రిగా తన చేతులు మీదుగా ఈ కార్యాలు జరగాల్సి ఉండటం దైవేచ్ఛ అని తెలిపారు. హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయం (ధార్మిక భవన్) లో మంత్రి కొండా సురేఖ శనివారం రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (సిటా)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగుల సంక్షేమం, పాలనా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధికి సిటా ఆధ్వర్యంలో కొత్త దిశను నిర్దేశించనున్నామని అన్నారు.
దేవాదాయ శాఖను సరికొత్తగా ఆవిష్కరించే దిశలో సిటా కార్యాచరణ ఉండోబోతున్నదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్ళకు సిటాను పునః ప్రారంభించుకోవడం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. ఆలయాల పరిపాలన, సిబ్బంది శిక్షణ, కొత్త సాంకేతికత అమలు దిశగా అవసరమైన విధానాలను, శిక్షణా కార్యక్రమాలను సిటా చేపడుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అర్చకులు, ఉద్యోగుల నిర్వహణలో దేవాలయాల నిర్వహణ, దేవాలయ భూముల సంరక్షణ, దేవాలయ ఆదాయ నిర్వహణ తదితర అంశాల్లో కొత్త ఒరవడి ప్రారంభవుతుందన్న ఆశాభావాన్ని మంత్రి సురేఖ వ్యక్తం చేశారు. దేవుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, దేవాదాయ శాఖ మంత్రిగా తన ఆధ్వర్యంలో దేవాలయాల వికాసం, ఉద్యోగుల సంక్షేమానికి చేపడుతున్న చర్యల పట్ల మంత్రి సురేఖ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు, దేవాలయ సిబ్బంది మొత్తం ఈ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
అర్చకులు, ఉద్యోగులు నిష్టతో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ధార్మిక సలహాదారు ఆర్. గోవింద హరి, సిటా డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, అడిషనల్ కమిషనర్లు శ్రీనివాస్, జ్యోతి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ లు వినోద్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్య ప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






