- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాత్రికి రాత్రి కూల్చివేతలు కాదు.. కబ్జాదారులపైనే హైడ్రా చర్యలు: కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా కార్యకలాపాలను నగర ప్రజలు క్షుణ్ణంగా గమనించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హితవు పలికారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా కార్యకలాపాలను నగర ప్రజలు క్షుణ్ణంగా గమనించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హితవు పలికారు. హైడ్రా వల్ల జరిగే ప్రయోజనాలపై ప్రజల్లో చర్చ జరగాలని కోరారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాను కబ్జా చేసి.. రూ. వందల కోట్లు కొల్లగొట్టేవారి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. హైడ్రా కార్యకలాపాలు, గొలుసుకట్టు చెరువులు, ప్రకృతి పరిరక్షణలో హైడ్రా పాత్ర అనే అంశంపై శనివారం తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దల్ పార్టీ (ఆర్ఎల్డీ) నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎల్‌డీ పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో హైడ్రా కార్యకలాపాలను కమిషనర్ వివరించారు.
‘‘కబ్జాలకు పాల్పడుతున్న వారికి హైడ్రా అంటే గిట్టడంలేదు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ.. ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు.. వారి నుంచి వందలు, వేల ఎకరాల భూములను హైడ్రా వెనక్కి తీసుకుంది. రాత్రికి రాత్రి హైడ్రా కూల్చదు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం. ఏడాది పాటు అధ్యయనం చేసి.. అన్ని రికార్డులు పరిశీలించాకే ఈ చర్యలు తీసుకున్నాం. హైడ్రా వల్ల పేదవాళ్లకు ఎక్కడా అన్యాయం జరగలేదు. హైడ్రా ఏర్పడి రెండేళ్లు అవుతోంది.. 2450 ఎకరాల భూమిని కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించాం. ఇందులో పెద్దలకు చెందిన కబ్జాలే ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణలో గుడెసెలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చేలా హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్నదే..
‘దోపిడీకి గురి కాని తెలంగాణను కోరుకున్నాం.. కాని ఇక్కడ వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసేస్తున్నారు. చెరువులతో పాటు నాలాలను కబ్జా చేసి నగరంలో వరదలకు కారణమౌతున్నారు. పాత లే ఔట్లను చెరిపేసి.. అందులోని పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కొల్లగొడుతున్నారు. సామాన్యుల ప్లాట్లను కలిపేసుకుని చుక్కలు చూపెడుతున్నారు. ఇలాంటి వారిపైనే హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోంది. వారే హైడ్రాపై సామాజిక మాధ్యమాల ద్వరా బురద చల్లుతున్నారు. అందులో వాస్తవాలు ఎంత అనేది గ్రహించాలి. కబ్జాదారుల కబంద హస్తాల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములలో ప్రభుత్వం ఇంటర్‌సిటీ బస్సు టర్మినల్ నిర్మిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించడమే కాదు.. పేదలకు డబుల్‌బెడ్ రూంల ఇళ్లు నిర్మాణానికి వినియోగించాలని ప్రయత్నిస్తోంది. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి నగరంలో వరదల నియంత్రణకు హైడ్రా పని చేస్తోంది’ అని రంగనాథ్ అన్నారు.






