Forex: ఒక్క వారంలో 10 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు

by S Gopi |

జూన్ 12తో ముగిసిన వారంలో నిల్వలు 9.98 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం బంగారు నిల్వల విలువలో నమోదైన భారీ పతనం.

Forex: ఒక్క వారంలో 10 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక నిల్వలు ఒక్క వారంలోనే దాదాపు 10 బిలియన్ డాలర్లు తగ్గి 671.6 బిలియన్ డాలర్లకు చేరాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 12తో ముగిసిన వారంలో నిల్వలు 9.98 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం బంగారు నిల్వల విలువలో నమోదైన భారీ పతనం. గత వారంలో కూడా నిల్వలు స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో, తాజా క్షీణత మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే విదేశీ మారక నిల్వలు ఇంకా ప్రపంచంలోనే అత్యంత బలమైన రిజర్వ్ స్థాయిలలో ఒకటిగా కొనసాగుతున్నాయి. సమీక్షించిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 846 మిలియన్ డాలర్లు పెరిగి 544.3 బిలియన్ డాలర్లకు చేరినా, బంగారు నిల్వల విలువ ఏకంగా 10.75 బిలియన్ డాలర్లు తగ్గి 103.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనివల్లనే మొత్తం ఫారెక్స్ నిల్వలపై పెద్ద ప్రభావం చూపింది. మరోవైపు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 66 మిలియన్ డాలర్లు తగ్గగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత నిల్వలు కూడా స్వల్పంగా క్షీణించాయి. మొత్తంగా చూస్తే, విదేశీ కరెన్సీ ఆస్తుల్లో మెరుగుదల కనిపించినప్పటికీ, గోల్డ్ రిజర్వుల విలువలో వచ్చిన భారీ తగ్గుదల కారణంగా మొత్తం విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయి.

Next Story