- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో మరో ఏడు బుల్లెట్ ట్రైన్ల కారిడార్లకు కేంద్రం ఆమోదం!
భారతదేశ హై-స్పీడ్ రైలు ఆశయాలకు సరికొత్త ఊపునిస్తూ దేశవ్యాప్తంగా కొత్తగా మరో ఏడు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం అధికారికంగా ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ హై-స్పీడ్ రైలు ఆశయాలకు సరికొత్త ఊపునిస్తూ దేశవ్యాప్తంగా కొత్తగా మరో ఏడు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, దేశంలో రైలు అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుస్తూ బెంగళూరు-హైదరాబాద్ (2 గంటల 10 నిమిషాలు), పుణె-హైదరాబాద్ (2 గంటల 8 నిమిషాలు) కారిడార్లను ఖరారు చేశారు. వీటితో పాటు ముంబై-అహ్మదాబాద్ (1 గంట 57 నిమిషాలు), ముంబై-పుణె (48 నిమిషాలు), బెంగళూరు-చెన్నై (73 నిమిషాలు), ఢిల్లీ-లక్నో (2 గంటలు), ఢిల్లీ-వారణాసి (3 గంటల 15 నిమిషాలు), ఢిల్లీ-సిలిగురి (6 గంటలు) మార్గాలను కేంద్రం సిద్ధం చేస్తున్నది.
ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్..
మరోవైపు, భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ కారిడార్ (508 కి.మీ) పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ సెక్షన్ సేవలను వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. జపాన్ సాంకేతిక, ఆర్థిక సహాయంతో 'షింకన్‌సెన్' వ్యవస్థ ఆధారంగా ఈ తొలి కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఢిల్లీ-వారణాసి-పాట్నా బుల్లెట్ రైలు కారిడార్‌కు కూడా ఆమోదం లభించిందని, ఈ హై-స్పీడ్ లైన్ అందుబాటులోకి వస్తే పాట్నా, ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం కేవలం 4 గంటల 41 నిమిషాలకు తగ్గుతుందని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఈ కారిడార్‌ను సిలిగురి వరకు పొడిగించే ప్రణాళికలు కూడా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాలకు బుల్లెట్ రైలు కారిడార్లను కేటాయించాలని కేంద్రానికి చేసిన విన్నపాలను సానుకూలంగా పరిశీలించిన తర్వాతే పీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా బిహార్‌లో రైల్వే అభివృద్ధిపై మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అంతకుముందు బిహార్ సీఎం సామ్రాట్ చౌదరితో కలిసి ఛాప్రా జంక్షన్ - ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త వారపు రైలును, అలాగే మౌ జంక్షన్-ఢిల్లీ, జహీర్‌ఘాట్-వారణాసి మధ్య మరో రెండు రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఒక పెద్ద రైల్వే విస్తరణ కార్యక్రమంలో భాగంగా రాబోయే ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలలో బిహార్‌కు 200 కంటే ఎక్కువ కొత్త రైళ్లు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారీ వ్యయంతో ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, మునుపెన్నడూ లేని విధంగా రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు.






