- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జీరో చైల్డ్ మ్యారేజెస్’ దిశగా తెలంగాణ.. పోక్సో కేసుల తగ్గింపే లక్ష్యం : మంత్రి సీతక్క
చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే అధికారులు బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పని చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే అధికారులు బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పని చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు, దాడులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థలో మిషన్ వాత్సల్య, సక్షమ్ అంగన్వాడి, మిషన్ శక్తి పథకాల అమలు పురోగతిపై రాష్ట్ర స్థాయి సమీక్షా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషన్ గౌరవ అధ్యక్షురాలు సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చిన్నారుల రక్షణ, సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న ‘మిషన్ వాత్సల్య’ పథకం అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న పిల్లలు, అనాథలు, నిరాశ్రయ చిన్నారులకు భద్రత కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు ఈ పథకం భరోసా ఇస్తుందన్నారు. చిన్నారులపై వేధింపులు, దాడులు లేదా ఇతర దుర్ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు వెంటనే స్పందించి, పైస్థాయి అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటారని, వారితో సున్నితంగా వ్యవహరిస్తూ అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలే భవిష్యత్ తరాలకు పునాది..
అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘సక్షమ్ అంగన్వాడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు సమగ్రంగా అందించడంతో పాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు పునాదులుగా నిలుస్తాయని, అందువల్ల వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. మహిళల భద్రత, రక్షణ, ఆర్థిక-సామాజిక సాధికారత కోసం ‘మిషన్ శక్తి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
పెద్దపల్లి జిల్లా స్ఫూర్తితో..
రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలనలో పెద్దపల్లి జిల్లా ఆదర్శంగా నిలిచిందని మంత్రి సీతక్క ప్రశంసించారు. ఆ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణను "జీరో చైల్డ్ మ్యారేజెస్" రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పోక్సో కేసులను తగ్గించేందుకు, బాలల హక్కులపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా మహిళా సంక్షేమ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సెర్ప్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మహిళలు, చిన్నారుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు అత్యుత్తమ సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు.






