అడుగు బయట పెడితే ఒట్టు.. అంతా ఆన్ లైన్ షాపింగ్

by Sujitha Rachapalli |

ఆన్ లైన్.. లేజీనెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేసింది. పక్క సంధులోనే షాపు ఉన్నా.. పాల ప్యాకెట్ ఆర్డర్ పెట్టుడే. పది అడుగులేస్తే సెలూన్ వస్తుందన్న..

అడుగు బయట పెడితే ఒట్టు.. అంతా ఆన్ లైన్ షాపింగ్
X

దిశ, ఫీచర్స్ : ఆన్ లైన్.. లేజీనెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేసింది. పక్క సంధులోనే షాపు ఉన్నా.. పాల ప్యాకెట్ ఆర్డర్ పెట్టుడే. పది అడుగులేస్తే సెలూన్ వస్తుందన్న.. అర్బన్ క్లాప్‌లో బార్బర్‌ను బుక్ చేసుడే. ఉప్పు, పప్పులు అయిపోతే పక్కింట్లో అరువు అడుక్కునే చాన్స్ ఉన్నా.. గొప్పలకు పోయి ‘బ్లింకిట్’ అనుడే. కానీ ఇండైరెక్ట్‌గా ఏం జరుగుతుంది? ఈ సోమరితనంతో రోగాలకు వెల్ కమ్ చెప్తున్నాం. కాలు కదపకుండానే పర్యావరణాన్ని పాడు చేస్తున్నం.

ఆ సంతోషం ఎక్కడ?

దసరా పండుగ వస్తుందంటే.. కాలనీకి కాలనీ ఒకేసారి టౌన్‌కు షాపింగ్‌కు పోయేది. ఉన్నంతలోనే నచ్చిన, మెచ్చిన బట్టలు తెచ్చుకునేది. టౌన్‌కు అందరు కలిసి వెళ్లడం వలన బోలెడన్ని సంతోషకరమైన జ్ఞాపకాలను వెనకేసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఫెస్టివల్ సేల్, రీజన్ ఫర్ సేల్, బిలియన్ డేస్.. అంటూ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా, అజీయో లాంటి యాప్స్ హోరెత్తిస్తున్నాయి. ఆఫర్ల మీద ఆఫర్లు.. ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్స్ ఇస్తూ.. మొబైల్‌ షాపింగ్‌కు బానిసలను చేస్తున్నాయి. సరే పైసలు లేవా ఈఎంఐలో తీసుకోమంటున్నాయి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే సరిపోతుందనే సలహాలు ఇస్తున్నాయి. ఆర్డర్ డెలివరీ పది నిమిషాల్లో కావాలా? సాయంత్రం కల్లా తెచ్చేయమంటారా? నెక్స్ట్ డే మీరు అవెలబుల్‌లో ఉన్నారా? అంటూ కస్టమర్‌ను అడుగు బయట పెట్టకుండా చేస్తున్నాయి. ఇదంతా మార్కెట్ జిమ్మిక్కే అయినా.. ఆ మాయాజాలానికి పడిపోయిన మనం.. అదే లాజిక్ లేకుండా ఫాలో అయిపోతున్నాం. గతంలో మాదిరిగా అందరితో కలిసి బయటకు వెళ్లి సంతోషంగా గడిపే రోజులను కోల్పోతున్నాం.

మారిపోయింది.. అంతా మాపోయింది..

జనరేషన్ మారినట్లే.. లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. పదేళ్ల క్రితం ఉన్న జీవనశైలికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు చాలా మారాయి. కొవిడ్ టైమ్ మనిషి జీవితాన్ని ఆన్ లైన్ మయం చేసేసింది. పక్క పిన్ను నుంచి పాల ప్యాకెట్ దాకా.. ఉప్పు, పప్పుల నుంచి పిల్లాడి ప్యాంపర్స్ వరకు.. ప్రోటీన్ పౌడర్ నుంచి టాయిలెట్ క్లీన్ చేసే లిక్విడ్ వరకు.. ప్రతీది ఆన్ లైన్‌లో అవెలబుల్ ఉంటుంది. ఒక్క క్లిక్ చేస్తే ఇంటి ముందే డెలివరీ అవుతుంది. దీంతో పక్కనున్న మనిషితో సంబంధం లేకుండా పోయింది. కనీసం పలకరించలేని రోజులు వచ్చేశాయి. పై కొసరు.. కంపేరిజన్ అనే టాక్సిక్ హ్యాబిట్ వెంటాడుతుంది. మనకు తెలిసినోళ్ల ఇంట్లో ఓ వస్తువు ఉందంటే.. మన ఇంట్లో ఉండాలనే ఆరాటం.. ఆన్ లైన్‌లో అప్పులు తీసుకుని మరీ కొనేందుకు దారితీస్తుంది. దీని కారణంగా చిక్కుల్లో ఇరుక్కుని బయటపడలేక పోతున్నారు.

మాదంతా ఆన్ లైన్

ప్రజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే షాపులో బట్టలు కొంటే చిన్నచూపు చూస్తున్నారు. ఛీ.. మేము షాపులో బట్టలు కొనుడేంది.. మాదంతా ఆన్ లైన్ షాపింగే అని గొప్పలు పోతున్ను. కానీ వీళ్లు చేసేది ఏంటో తెలుసా...

ఎక్కువ ధరలో ఉన్నా బట్టలు కొని.. పండుగకు అవే బట్టలు వేసుకుని షో చేసి.. మేము చాలా గొప్పోళ్లమని చూయించుకుని.. రిటర్న్ టైమ్ గడవకముందే రిటర్న్ చేసేస్తారు. ఆన్ లైన్ షాపింగ్‌లో ఉన్న సౌలభ్యాన్ని వాడుకుంటరు. ఆ బట్టలకు మళ్లీ రిఫండ్ పొందుతారు. ఇటు పైసల్ సేఫ్.. అటు నలుగురిలో కాస్ట్ లీ బట్టలు వేసుకున్నారనే బిల్డప్.. రెండు విధాలుగా ప్లస్. ఇంకొందరు మేధావులు.. కరెక్ట్ ఐటెమ్ డెలివరీ అయినా సరే... రాంగ్ ఐటెమ్ వచ్చిందనే సాకుతో పాత బట్టలను రిటర్న్ చేస్తరు. ఇలాంటి పనుల వల్ల యూజ్ అండ్ థ్రో కల్చర్ పెరిగిపోతుంది. రాంగ్ రిటర్న్ వల్ల ఆన్‌లైన్ కంపెనీలు నష్టపోతున్నాయి. చివరికి ధరలు పెరిగి మళ్లీ మనకే నష్టం జరుగుతుంది.

మాకు బుద్ధి రాదు?

ఓ వ్యక్తి ఆన్ లైన్‌లో ఐ ఫోన్ బుక్ చేస్తాడు.. కానీ డెలివరీ అయ్యాక ఓపెన్ చేస్తే.. ఓ ఇటుక ప్రత్యక్షమవుతుంది. ఇంకొకరు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు.. కానీ అందులో సగం తినేసిన బిర్యానీ ఉంటుంది.. ఒక్కోసారి మటన్ బిర్యానీ డెలివరీ అవుతుంది. పాల ప్యాకెట్ ఆర్డర్ చేస్తే పాలు విరిగిపోతయి.. కూరగాయలు ఆర్డర్ చేస్తే కుళ్లిపోతయి.. కానీ మనం మారం.. సక్కగా షాపుకు వెళ్లి మనకు నచ్చినట్లుగా కొనుక్కుందాం అనుకోం. ఓ అడుగు వేస్తే చిక్కని పాలు.. తాజా కూరగాయలు కొనుక్కోవచ్చని అనుకోం. చేతిలో ఫోన్ ఉంది.. ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి.. మన చేతికి వేళ్లు ఉన్నాయి.. మనకు కావాల్సినంత లేజీనెస్ ఉంది. కాబట్టి ఒక్క క్లిక్ చేస్తే సరిపోయే అనుకుంటం.

మేము పర్యావరణానికి శత్రువులం

ఆన్ లైన్ షాపింగ్ అంటే ప్యాకేజింగ్ మస్ట్. ప్రతి ఆర్డర్‌కి ప్లాస్టిక్ బబుల్ ర్యాప్, బాక్సులు, ఎయిర్ ప్యాడ్స్, టేపులు వంటివి వాడతారు. కానీ వాటిని మళ్లీ మళ్లీ యూజ్ చేయలేం. దీని కారణంగా ఏటా బిలియన్ల ప్యాకేజింగ్ మెటీరియల్ వ్యర్థాలు జనరేట్ అవుతున్నాయి. వీటిలో 14శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతుండగా.. మిగిలినవి డంప్ యార్డులు, సముద్రాల్లోకి వెళ్తున్నాయి. అనేక జీవరాశుల మనుగడకు నష్టం చేకూరుస్తున్నాయి. ఇక ఐటెమ్ రిటర్న్ షిప్పింగ్ కారణంగా ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల CO₂ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇది సుమారు ఐదు మిలియన్ కార్ల ఒక సంవత్సరం కార్బన్ ఉద్గారాలకు సమానం. రిటర్న్ చేసిన వస్తువులు తిరిగి షిప్ అయ్యేటప్పుడు మళ్లీ ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్ అవసరం కాబట్టి.. ఐటెమ్ రిటర్న్ అనేది మొదటి డెలివరీ కంటే 30% అదనపు ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. డెలివరీ వ్యాన్ మల్టిపుల్ ఆర్డర్లు తీసుకెళ్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ మంచిదని అధ్యయనాలు చెప్పినా.. ఫాస్ట్ డెలివరీ, ఎక్కువ రిటర్న్స్, ఎయిర్ షిప్పింగ్ వల్ల ఆ లాభం లేకుండా పోయి నష్టం ఎక్కువవుతోంది. వేర్‌హౌస్‌లు, డేటా సెంటర్లు, లైటింగ్, కూలింగ్ వ్యవస్థల వల్ల అదనపు శక్తి వినియోగం కూడా తప్పదు.

స్థానిక వ్యాపారాలకు నష్టమే..

రిటర్నింగ్ పాలసీ.. రిటర్న్ గడువు.. రీఫండ్ ఆప్షన్స్.. బయటకు వెళ్లే అవసరం లేని సౌలభ్యం.. అడుగు బయట పెట్టడమే భారం అయిపోవడం.. ఆన్ లైన్ వైపు మొగ్గుచూపుతుంది. కానీ దీని కారణంగా స్థానిక వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. చిన్న చిన్న వ్యాపారులు, దుకాణాదారులు ఆదాయం కోల్పోతున్నారు. బిజినెస్‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలా చూస్తే పెద్ద కార్పోరేట్ ఆన్ లైన్ కంపెనీలు లాభపడుతూ.. స్థానికంగా ఉపాధి తగ్గుతుందని అనిపిస్తుంది. దుకాణాదారుడు, కస్టమర్ రిలేషన్‌షిప్ అనేది దాదాపు అంతరించిపోయే స్టేజ్‌కు వచ్చేసింది. ఆటోమేటిక్‌గా సోషల్ కమ్యూనికేషన్ కూడా పడిపోయింది. ఇక భారతదేశంలో కిరాణా స్టోర్లు FMCG సేల్స్‌లో 80% వరకు చేయగలవు. కానీ క్విక్ కామర్స్..Blinkit, Zepto లాంటివి చాలా స్టోర్లు మూతపడేందుకు కారణమవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, వోల్‌సేల్ డీలర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

రోగాలు తెచ్చుకోవట్లేదా?

బయటకు వెళ్లి షాపింగ్ చేస్తే కాస్త శరీరానికి శ్రమ కలుగుతుంది. నలుగురితో మాట్లాడటం వల్ల ఎంతో కొంత మానసిక ఉల్లాసం కలుగుతుంది. దీంతో బాడీ అండ్ మైండ్ రెండూ హ్యాపీ. అలా కాకుండా ఉన్న చోటు నుంచి కదలకుండా ఫోన్ పట్టుకుని.. దాన్ని రోజుల తరబడి చూసి.. పది డ్రెస్సులు సెలెక్ట్ చేసి.. అందులో ఒక్కటి ఫైనలైజ్ చేసి.. కొని.. మళ్లీ రిటర్న్ ఇవ్వడం వల్ల భారీ నష్టాలే జరుగుతున్నాయి. గంటల కొద్దీ ఫోన్ చూడటం వల్ల కండ్లు దెబ్బతింటున్నాయి. మైండ్ స్ట్రెస్ అవుతుంది. బయటకు వెళ్లకుండా ఐసోలేట్ కావడం, సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మానకసిక ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనం, ఆందోళన వెంటాడుతున్నాయి. బాడీకి లేజీనెస్ పెరిగిపోయి.. రోగాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది.

అనుభవాలను వదులుకోవట్లేదా?

మొత్తానికి సౌకర్యం పేరుతో మనం కూడా మర మనుషులం అయిపోతున్నామా అనిపిస్తుంది. కంఫర్ట్ పేరుతో ఫ్రీడమ్‌ను ఎంజాయ్ చేయకుండా.. ఆన్ లైన్ అనే చట్రంలో ఇరుక్కుపోయామనే ఫీలింగ్ కలుగుతుంది. చిన్నప్పుడు పాలు తెచ్చేందుకు ఓ చెంబు పట్టుకుని నేను, నానమ్మ వెళ్తుంటే.. రోడ్డు మీద కలిసిన ఊరోళ్లందరూ పలకరించేది. ఇప్పుడు అదెక్కడిది... పిల్లలకు ఫోన్, ట్యాబ్ ఇచ్చి వీడియోలు పెట్టి చూసుకోమనటం.. పాలు కూడా ఆన్ లైన్‌లోనే తెప్పించుకోవడం. దీని వల్ల పిల్లలు కూడా మెషిన్ ఫ్రెండ్లీ అయిపోతున్నారు తప్పితే కొత్తగా ఫ్రెండ్స్‌ను చేసుకోవట్లేదు. ఆన్ లైన్‌లో ఏజ్‌కు మించిన కంటెంట్ చూసి చెడిపోవడం.. ఇతరులతో పోల్చుకుని మాకు లేదని బాధపడిపోవడం, డిప్రెషన్‌లోకి పోవడం మాత్రమే మిగులుతుంది. జ్ఞాపకాలు అనేవి లేకపోగా.. ఆ ఫోన్ చూస్తే వచ్చే విజన్ లాస్, బ్రెయిన్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ బోనస్‌లు.

వ్యక్తిగత సంబంధాలకు దూరం

స్థానిక దుకాణదారుడు మన ఇంటి పక్కనే ఉంటాడు. మన అవసరాలు తెలిసి ఉద్దెర ఇస్తాడు. సమస్యల్లో ఉంటే డబ్బులు తిరిగి ఇవ్వడం లేట్ అయినా.. పోనీలే అనుకుంటడు. పైగా సమస్యల్లో ఉన్నామంటే జాలి చూపిస్తాడు. ఇంకేమైనా కావాలంటే తీసుకెళ్లి.. తర్వాత డబ్బులు ఇచ్చినా ఓకే అంటాడు. కానీ ఇలాంటి వ్యక్తిగత సంబంధం ఆన్ లైన్‌లో ఉంటుందా? కచ్చితంగా ఉండదు. ఆన్ లైన్ యాప్‌లో ఓ లోన్ తీసుకున్నాం అనుకుందాం. నెల స్టార్ట్ అయిన పది రోజుల్లోనే మనీ కట్ కావాలి. లేదంటే వాడు ఫోన్లు చేస్తనే ఉంటడు. భయం వెంటాడేలా చేస్తడు. అయినా సరే మనకు ఆన్ లైన్‌లో సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపైనే ధ్యాస ఉంటుంది. ఎలాగూ ఈఎంఐ పెట్టి కొనుక్కోవచ్చు కాబట్టి తాహతకు మించినా పర్వాలేదని ఫీల్ అయిపోతం. కానీ దాని వెనుక ఎంత ఎక్స్‌ట్రా లాగుతుంటారనేది మాత్రం ఆలోచించం.

ఆర్థిక ప్రభావం

స్థానిక దుకాణాల్లో వస్తువులు కొంటే డబ్బు స్థానిక ఆర్థిక వ్యవస్థలోనే తిరిగి ప్రవేశిస్తుంది. దీన్ని మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటం. అంటే ఒక వ్యక్తి డబ్బు ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడకుండా.. సమాజంలో అనేక మంది చేతుల్లో తిరుగుతూ అదనపు ఆదాయం, ఉపాధి సృష్టికి కారణమవుతుంది. కానీ ఆన్‌లైన్ జెయింట్స్‌కి వెళ్తే డబ్బు దేశంలోని ఒక్క చోటికి లేదా విదేశాలకు వెళ్తుంది. కమ్యూనిటీలో ఆర్థిక ప్రసరణ తగ్గి, మొత్తం స్థానిక ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. మన భవిష్యత్తు దెబ్బతింటుంది. అదే స్థానిక వ్యాపారాలకు మద్దతిస్తే.. ఆర్థిక మాంద్యాల్లో మనల్ని ఆదుకుంటాయి. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తాయి. అందుకే ప్రభుత్వం ఓన్ఎన్‌డీసి(ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) వంటి చర్యలు తీసుకుంటుంది. పెద్ద ఈ-కామర్స్ కంపెనీల మోనోపాలీని తగ్గించి.. చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, స్థానిక వ్యాపారాలు, రైతులు, కార్మికులు.. అందరూ సమానంగా డిజిటల్ మార్కెట్‌లో పాల్గొనేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందరికీ వ్యాపారం అనే లక్ష్యంతో.. స్థానిక వ్యాపారాలను రక్షించి, ఆన్‌లైన్ జెయింట్స్‌తో సమానంగా పోటీ పడే అవకాశం కల్పిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

మొదట్లో టీవీ, ఫ్రిజ్ లాంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాడిని. ఆన్‌లైన్‌లో అయితే ఆఫర్లు ఉంటాయి, తక్కువకు వస్తాయని అలా చేశాను. కానీ ఇప్పుడు అదే అలవాటు పాల ప్యాకెట్ లాంటి చిన్న చిన్న వాటికి కూడా పాకిపోయింది. ఇది ఒక వ్యసనంలా మారిపోయింది. ఎంతలా అంటే బోర్ కొట్టినప్పుడు కూడా ఆన్‌లైన్‌లో కొత్తగా ఏమున్నాయి అని వెతుకుతూ వృధా ఖర్చు చేయడం ప్రారంభమైంది. దీంతో మా ఇంట్లో గొడవలు కూడా వస్తున్నాయి.

- ఆనంద్, నర్సింహులపేట

ఆన్‌లైన్ షాపింగ్ వల్ల నాకు కలిగే లాభం ఏంటో కానీ, మా పల్లెటూర్లో మాత్రం సమస్యలు వస్తున్నాయి. నేను ఎక్కువగా నా పిల్లల కోసం ప్రతి చిన్న వస్తువు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంటాను. ఆర్డర్ చేసిన వాటిని ఇంటికి తెచ్చివ్వడానికి డెలివరీ బాయ్స్ వస్తుంటారు. వాళ్లు దాదాపుగా మధ్యాహ్నం సమయాల్లో వస్తుంటారు. అలా ప్రతిరోజు ఒక్కో వ్యక్తి రావడం, ఒకే వ్యక్తి ఎక్కువ సార్లు రావడం గమనించిన మా ఇంటి చుట్టుపక్కల వాళ్లు నా గురించి తప్పుగా అనుకున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్ కారణంగా పల్లెటూళ్లలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని నా అభిప్రాయం. అందుకే తగ్గిస్తే మంచిది.

- శ్వేత, తొర్రూరు

ఆన్‌లైన్ ఆర్డర్ విషయంలో అన్నీ నెగెటివ్‌లు మాత్రమే ఉంటాయనుకోవద్దు. కొన్ని పాజిటివ్‌లు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో మెడిసిన్ ఆర్డర్ చేయడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. నాకు అవసరమైన మెడిసిన్ ఒకటి ఎన్ని షాపులు తిరిగినా దొరకలేదు. కానీ ఒక్క క్లిక్‌తోనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగలిగాను. ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఆన్‌లైన్ ఆర్డర్‌లను మెచ్చుకోవాలి. అవసరమయ్యే వాటిని ఎక్కడి నుంచి సంపాదించుకున్నా తప్పు లేదనేది నా అభిప్రాయం. అది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరుకు నాణ్యంగా ఉంటే అంతే చాలు.

- శంకర్ ప్రసాద్, ఓల్డ్ అల్వాల్

Next Story