ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్‌కు షాక్

by Ratna Kumari |

రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు గండిపేట రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు.

ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్‌కు షాక్
X

దిశ, గండిపేట: రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు గండిపేట రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన భూమిలో చేపట్టిన నిర్మాణాలు గండిపేట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు సోమవారం వాటిని కూల్చివేశారు. గండిపేట మండలం మంచిరేవుల వీరభద్రస్వామి ఆలయం సమీపంలోని సర్వే నంబర్లు 326, 327, 328, 329లో బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌తో పాటు పూజారి నాగేంద్రప్ప, మరో వ్యక్తికి కొంత భూమి ఉంది. ఈ భూమిని లీజుకు ఇవ్వగా, అందులో సుమారు ఎకరం విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి ఓ పాఠశాలకు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. అయితే, సదరు ప్రాంతం మొత్తం గండిపేట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉండటంతో నిర్మాణాలను తొలగించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వారికి నాలుగు రోజుల గడువు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేయడానికి ప్రయత్నించగా, వాటిని స్వీకరించేందుకు నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హైకోర్టు సూచనల మేరకు నిర్మాణాలను స్వయంగా తొలగించుకోవడానికి రెండు రోజుల గడువు ఇచ్చినా స్పందన లేకపోవడంతో, గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం అధికారులు అక్కడికి చేరుకుని రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు.

స్థానికంగా చర్చనీయాంశం..

రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు చెందిన స్థలంలో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టడం స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తి స్థలంలో కూల్చివేతలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story