- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రైతులకు గుడ్ న్యూస్.. జిల్లాకో ఇంటిగ్రేటెడ్ భూ భారతి అమలు
రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సోమవారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు చెప్పారు. గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు పలికినట్లు తెలిపారు. రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందే విధంగా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా రూపొందించామన్నారు. రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఐదు మండలాల్లో పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు వివరించగా, అక్కడి అనుభవాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆరు లక్షలకు నోటీసులు
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో, ఇప్పటి వరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ పూర్తి చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన దరఖాస్తులను పరిష్కారించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారానికి 2020 ఆర్వోఆర్ చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. తమ ప్రభుత్వం నిబంధనలను సవరించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు.






